Telugu Global
National

బ్యాంక్ మేనేజర్ జాబ్‌కు రిజైన్ చేసి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

చిన్నప్పటి నుంచి 'లాల్ పరీ' నడపాలనేది తన కల అని శీతల్ చెబుతోంది. పూణే నగరంలో తిరిగే ఈ బస్సులంటే తనకు చాలా ఇష్టమని కూడా అంటోంది.

బ్యాంక్ మేనేజర్ జాబ్‌కు రిజైన్ చేసి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ
X

హాయిగా ఏసీలో కూర్చొని.. కంప్యూటర్ ముందు ఫైల్స్ తిరగేస్తూ.. నలుగురు కస్టమర్లతో మాట్లాడి సాయంత్రానికి ఇంటికి చేరుకునే బ్యాంక్ మేనేజర్ జాబ్ కావాలా? రాత్రనకా, పగలనకా.. ఎండనకా, వాననకా రోడ్లపై భారీ వాహనాన్ని నడిపే జాబ్ కావాలా? అంటే ఎవరైనా బ్యాంక్ మేనేజర్ జాబే ఎంచుకుంటారు. కానీ, పూణేకు చెందిన ఓ మహిళ మాత్రం తాను ఐదేళ్లుగా చేస్తున్న బ్యాంక్ మేనేజర్ జాబ్‌ను వదిలేసి.. ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది. తన చిన్ననాటి కలను తీర్చుకోవడానికే వైట్ కాలర్ జాబ్ వదిలేసినట్లు చెబుతోంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పూణేకు చెందిన శీతల్ శిండే 2014 నుంచి యాక్సిస్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తోంది. అయితే 2019లో మహారాష్ట్ర ఆర్టీసీ పూణే డివిజన్‌లో బస్‌లు నడపడానికి మహిళా డ్రైవర్లు కావాలని నోటిఫికేషన్ జారీ చేసింది. పూణే నగరంలో తిరిగే ఎర్ర బస్సు (అక్కడ లాల్ పరీ అని పిలుస్తారు) నడపడానికి మహిళా డ్రైవర్లను నియమించాలని అనుకోవడం గత 75 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ నోటిఫికేషన్ చూసిన శీతల్ శిండే వెంటనే జాబ్‌కు అప్లై చేసింది. ఎస్ఎస్ఆర్టీసీ నిర్వహించిన టెస్టులో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె తొలి విడత మహిళా డ్రైవర్ల కోటాలో ఎంపికైంది.

చిన్నప్పటి నుంచి 'లాల్ పరీ' నడపాలనేది తన కల అని శీతల్ చెబుతోంది. పూణే నగరంలో తిరిగే ఈ బస్సులంటే తనకు చాలా ఇష్టమని కూడా అంటోంది. అందుకే నోటిఫికేషన్ చూడగానే మరో ఆలోచన లేకుండా అప్లై చేశానని, ఎంపిక అయిన వెంటనే బ్యాంక్ మేనేజర్ జాబ్‌కు రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తనకు కారు స్టార్ట్ చేయాలన్నా చాలా భయంగా ఉండేదని.. కానీ ఏడాదిన్నర శిక్షణలో భారీ వాహనం నడపడం నేర్చుకోవడం చాలా సరదాగా, సంతోషంగా ఉందని శీతల్ చెప్పింది.

తొలి విడతలో మొత్తం 17 మంది మహిళా డ్రైవర్లు ఎంపికయ్యారు. వీరందరికీ 2019లోనే శిక్షణ ప్రారంభించాలని అనుకున్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం వీరి శిక్షణ ప్రారంభం అయ్యింది. ఏడాదిన్నర పాటు ఉండే శిక్షణ ఈ ఏడాది మార్చిలో ముగియనున్నది. ఆ తర్వాత వీరిని ఫుల్ టైమ్ డ్రైవర్లుగా నియమిస్తారు. మహారాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ ఫర్ ఉమెన్ ద్వారా వీరి నియమకాలు జరిగాయి. వీరికి కావల్సిన తోడ్పాటును ఎస్టీ కార్పొరేషనే అందించింది.

First Published:  1 Feb 2023 10:01 AM IST
Next Story