ఆమె ఓ సూపర్ సీఎం.. తమిళిసై పై తీవ్ర విమర్శలు..
తమిళిసై పుదుచ్చేరికి సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నారాయణ స్వామి. అన్నాడీఎంకే పుదుచ్చేరి కార్యదర్శి అన్బళగన్ కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తప్పుబట్టారు.
ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు రాజ్ భవన్ ఆమోద ముద్ర వేస్తుంది, అవసరమైతే సలహాలు ఇస్తుంది. అంతే కానీ, ఎక్కడా గవర్నర్లు పాలనలో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే కచ్చితంగా అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే, ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులను అవమానించినట్టే, సమాంతర ప్రభుత్వం నడిపినట్టే. బీజేపీ నియమిత గవర్నర్లు, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ఇలా సమాంతర ప్రభుత్వాలు నడపడానికి ఇష్టపడుతున్నారు. బీజేపీ కూటములు ఉన్నదగ్గర కూడా వారు పెత్తనం చలాయించాలనుకుంటున్నారు. ఈ వ్యవహారానికి తాజా ఉదాహరణ గవర్నర్ తమిళి సై. తెలంగాణకు గవర్నర్ గా ఉంటున్న ఆమె, పుదుచ్చేరికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు చోట్లా ఆమె తనదైన పైత్యాన్ని ప్రభుత్వాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పుదుచ్చేరిలో ఇటీవల ఆమె ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించారు. దాదాపు పాతికమంది ప్రజలు ఆ కార్యక్రమానికి వచ్చి అర్జీలు ఇచ్చారు. అక్కడ బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నవారికి ఆమె చేసిన పని పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వ పాలనలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ జోక్యం ఎందుకని నిలదీశాయి. తమిళిసై పుదుచ్చేరికి సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నారాయణ స్వామి. అన్నాడీఎంకే పుదుచ్చేరి కార్యదర్శి అన్బళగన్ కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తప్పుబట్టారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు, ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వానికి తీరని అవమానం చేసినట్టని విమర్శించారు. గవర్నర్ కి పాలనలో జోక్యం చేసుకోవాలనిపిస్తే.. కేంద్రాన్ని సంప్రదించి రాష్ట్రానికి నిధులు తేవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యలు చేపట్టకూడదని హితవు పలికారు అన్బళగన్.
తమిళిసై రియాక్షన్ ఏంటంటే..?
పుదుచ్చేరి ఓపెన్ హౌస్ పై వచ్చిన విమర్శలు తమిళిసై చెవిన కూడా పడ్డాయి. తనపై వచ్చిన విమర్శలను ఆమె తేలిగ్గా కొట్టిపారేశారు. తెలంగాణలో కూడా తాను మహిళా దర్బార్ నిర్వహించానని, అక్కడికి వచ్చిన మహిళల సమస్యలు తాను పరిష్కరించగలిగానని, ఆ తర్వాత విద్యార్థులను కూడా రాజ్ భవన్ కి పిలిపించి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించానని వివరణ ఇచ్చారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం తాను పుదుచ్చేరిలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు తమిళిసై.