రెజ్లర్లను రెచ్చగొట్టిన పీటీ ఉష.. ఏమన్నారంటే..?
పీటీ ఉష వ్యాఖ్యలతో బాధపడ్డామని, మహిళ అయినప్పటికీ ఆమె తమకు మద్దతివ్వడంలేదని చెప్పారు రెజ్లర్లు. క్రమశిక్షణారాహిత్యంగా తాము ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్ల ఆందోళన శిబిరాన్ని సందర్శించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) చీఫ్ పీటీ ఉష మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్ల నిరసన క్రమశిక్షణారాహిత్యానికి సమానమని పేర్కొన్నారు. ఆటగాళ్లు వీధుల్లో నిరసనలు చేయకూడదని.. కనీసం కమిటీ నివేదిక కోసం ఎదురుచూడాలన్నారు. వారు చేసిన పని ఆటకు, దేశానికి మంచిది కాదన్నారు. ఇది ప్రతికూల విధానమని విమర్శించారు.
గతంలో కూడా పీటీ ఉష వ్యాఖ్యలతో రెజ్లర్లు నొచ్చుకున్నారు. నిరసన తెలపడానికి ముందు, వారి ఆరోపణలు పరిశీలించడానికి నియమించిన కమిటీ నివేదిక కోసం రెజ్లర్లు వేచి ఉండాలని పీటీ ఉష అన్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా రెజ్లర్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు ఘాటుగా స్పందించారు. పీటీ ఉష వ్యాఖ్యలతో బాధపడ్డామని, స్వయంగా మహిళ అయినప్పటికీ ఆమె తమకు మద్దతివ్వడంలేదని చెప్పారు రెజ్లర్లు. క్రమశిక్షణారాహిత్యంగా తాము ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. శాంతియుతంగా ప్రదర్శన చేపట్టడాన్ని కూడా తప్పుబడతారా అని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగి ఉంటే ఇలా నిరసన తెలిపే అవసరం రాదు కదా అన్నారు రెజ్లర్లు. పీటీ ఉషపై ఒత్తిడి ఉందో లేదో తమకు తెలియదన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలనేది రెజ్లర్ల ప్రధాన డిమాండ్. కానీ దానికి కేంద్రం అంగీకరించడంలేదు. బ్రిజ్ భూషణ్ కూడా స్వచ్ఛందంగా తన పదవి నుంచి వైదొలగడానికి ఒప్పుకోవడంలేదు. ఈ దశలో కేంద్రంలోని పెద్దలు, క్రీడాకారులు.. రెజ్లర్లతో చర్చలు జరుపుతున్నా అవి ఫలప్రదం కావడంలేదు. అంతర్జాతీయంగా భారత రెజ్లర్ల వ్యవహారం చర్చకు వచ్చింది. భారత్ కి ఇది మచ్చగా మిగిలిపోతుందని అంటున్నారు తోటి క్రీడాకారులు. కానీ ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో రెజ్లర్లు ఆందోళనకే సిద్ధపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు జంతర్ మంతర్ దీక్షా శిబిరాన్ని వీడి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ దశలో బలప్రయోగానికి కేంద్రం వెనకాడుతోంది. భారత్ కి పతకాలు తెచ్చినవారిని అవమానిస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది కేంద్రం. కర్నాటక ఎన్నికల వేళ.. రెజ్లర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే, మొదటికే మోసం వస్తుందని భయపడుతోంది.