అటు విపక్షాలు.. ఇటు అధికార పక్షం.. పార్లమెంట్ నిరసనల స్పెషల్..
ఈ దఫా పార్లమెంట్ లో అధికార పక్షం కూడా నిరసన ప్రదర్శనలకు దిగింది. రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఈ నిరసనలకు కారణం అయ్యాయి.

సహజంగా చట్ట సభల సమావేశాల్లో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి, నిరసన ప్రదర్శనలకు దిగుతుంటాయి. కానీ ఈ దఫా పార్లమెంట్ లో అధికార పక్షం కూడా నిరసన ప్రదర్శనలకు దిగింది. రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఈ నిరసనలకు కారణం అయ్యాయి. ఇప్పటి వరకు విపక్షాలు ధరల పెరుగుదలపై నానా రభస చేశాయి. ఆ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలా అని ఎదురు చూసిన అధికార పక్షానికి అధీర్ వ్యాఖ్యలు అనుకోకుండా దొరికాయి. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా రచ్చ చేస్తున్నారు. అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
పార్లమెంట్ తాజా సమావేశాలు నిరసనల ప్రత్యేక సమావేశాలుగా మారిపోయాయి. మొన్నటి వరకు విపక్షాలు ధరల పెరుగుదలపై పార్లమెంట్ లోపల బయట నిరసనలు తెలిపాయి. ప్లకార్డ్ లతో సమావేశాలను అడ్డుకున్నారు విపక్ష సభ్యులు. వారిని సస్పెండ్ చేసిన తర్వాత గొడవ మరింత పెరిగింది. సస్పెన్షన్ ఎత్తివేత కోసం ఏకంగా ఎంపీలు 50 గంటల దీక్ష చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే 20 మంది ఎంపీలు రాత్రంతా ఉన్నారు. వారికి మిగతా పార్టీలు అల్పాహారాన్ని, భోజనాన్ని అందజేశాయి. ఈ గొడవ జరుగుతుండగానే అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలు కలకలం రేపాయి.
రాష్ట్రపత్ని అంటూ ఆయన నూతన రాష్ట్రపతిని సంబోధించడంతో సభలో కలకలం రేగింది. అవకాశం కోసం చూస్తున్న ఎన్డీఏ పక్షాలు గొడవ మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను కించపరుస్తూనే ఉంటారని.. మన దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని కించపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోపల, బయట కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపత్ని అని సంభోదించడం.. అత్యున్నత రాజ్యాంగ పదవిని కించపరిచేలా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దళిత, మహిళ వ్యతిరేకి అని దేశానికి తెలుసని స్మృతి ఇరానీ విమర్శించారు. అటు విపక్షాలు, ఇటు అధికార పక్షాల పోటా పోటీ నిరసనలతో.. పార్లమెంట్ తాజా సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.