Telugu Global
National

హిందీని రుద్దే ప్ర‌య‌త్నం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాసంస్థల్లోనైనా సరే హిందీని తప్పనిసరి భాష చేయాలన్న ప్రతిపాదన సరికాదు. ఎందుకంటే అక్కడి ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్రీయ విద్యాలయాల్లో కేవలం ఆయా రాష్ట్రాల వారే కాదు, దేశంలోని సకల ప్రాంతాలవారు చదువుకుంటారు.

హిందీని రుద్దే ప్ర‌య‌త్నం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
X

దేశంలో హిందీయేతర ప్రాంతాల మీద, ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి మీద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అనేక భాషలు మాట్లాడేవారున్న దేశంలో హిందీని తప్పనిసరి భాషగా అమలు చేయాలనడం ప్రజాస్వామ్య విలువల‌కు విఘాతం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి భాషల వైవిధ్యాన్ని దెబ్బతీసే కుట్రలకు తెరతీసింది. తాజాగా ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీని తప్పనిసరి భాషగా చేయాలని సిఫారసు చేస్తూ అమిత్‌షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక ఇచ్చింది. అనేక భాషలున్న దేశంలో కేవలం హిందీని ప్రధాన భాషగా, తప్పనిసరి భాషగా సిఫార్సు చేయడం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదని దక్షిణాది రాష్ట్రాలు విస్పష్టంగా చెబుతున్నాయి.

ఒకే భాష, ఒకే మతం, ఒకే సంప్రదాయం పేరిట ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేయాలన్నది బిజెపి ప్రభుత్వ కుటిల వ్యూహంగా ఈ నివేదికపై బిజెపి యేతర పక్షాలన్నీ మండిపడుతున్నాయి. దేశంలోని భాషా వైవిధ్యాన్ని హరించే ఈ ధోరణి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం. ఎవరు ఏ భాషలో మాట్లాడాలో, ఏ భాషని ఎంచుకోవాలో ప్రభుత్వాలు చెప్పడం సమ్మతం కాదు.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాసంస్థల్లోనైనా సరే హిందీని తప్పనిసరి భాష చేయాలన్న ప్రతిపాదన సరికాదు. ఎందుకంటే అక్కడి ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్రీయ విద్యాలయాల్లో కేవలం ఆయా రాష్ట్రాల వారే కాదు, దేశంలోని సకల ప్రాంతాలవారు చదువుకుంటారు. ఆయా సంస్థల్లో విద్యార్థులుగా చేరుతారు. కనుక అక్కడ బోధనా మాధ్యమంగా హిందీని త‌ప్ప‌నిస‌రి భాషగా అమలు చేయడం సరైందికాదు. అప్పటి వరకు ఇంగ్లీషులోనో, తమ ప్రాంతీయ భాషల్లోనో చదువుకున్నవారు ఆకస్మాత్తుగా హిందీలో మాత్రమే చదివి తీరాలనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. అలాగే కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీని తప్పనిసరి భాష చేయడం ఏవిధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీని వల్ల హిందీయేతర ప్రాంతాలవారు నష్టపోతారు. మాతృభాష హిందీ మాట్లాడేవారితో పోటీపడలేక ఆయా సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు దూరమవుతారు. ఇది ప్రాంతాల మ‌ధ్య విద్వేషాల‌ను రాజేస్తుంది.

హిందీని జాతీయభాష అనే పేరిట దేశం మొత్తం మీద రుద్దాలనుకోడం సహేతుకం కాదు. ఎందుకంటే అసలు హిందీ జాతీయ భాష కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో హిందీ మాట్లాడేవారు 43.63 శాతం మాత్రమే. తరువాత బెంగాలీ మాట్లాడేవారు 8.03 శాతం, మరాఠీ భాషీయలు 6.86 శాతం, 6.70 శాతం తెలుగులోనూ, 5.70 శాతం జనాభా తమిళంలోనూ మాట్లాడుతారు. మొత్తం జనాభాలో 56 శాతానికి పైగా ఇతర భాషలే మాట్లాడుతున్నారు. ఈర‌కంగా చూసిన‌పుడు హిందీ అత్యధికుల భాష కాద‌ని తెలిసిపోతుంది. అందుకే హిందీని మన జాతీయ భాషగా చెప్పడం అబద్ధం, అభ్యంతకరం. హిందీ కన్నా ఇతర భాషలు మాట్లాడేవారు అధికంగా ఉన్నప్పుడు హిందీ జాతీయ భాష కాజాల‌దు. దానిని ఒక అధికార భాషగా గుర్తించవచ్చు. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో దానిని అమలు చేసుకోవచ్చు. కానీ హిందీయేతర ప్రాంతాల్లోనూ హిందీని అమలు చేయాలనుకోడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధం. అలాగే హిందీయేతర భాషలవారు హిందీలోనే చదవాలనడం, హిందీలోనే పోటీ పరీక్షలు రాయాలనడం సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు ప్రకారం గుర్తింపు పొందిన భాషలు 22 ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్రాలలో అధికార భాషలుగా అమలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య, ఇతర అధికారిక వ్యవహారాల కోసం హిందీ లేదా ఇంగ్లీషు అధికార భాషలుగా ఉన్నాయి. 22 షెడ్యూల్డ్‌ భాషలే గాక దేశంలో పది లక్షల జనాభాకు మించినవారు మాట్లాడే భాషలు 60కి పైగా ఉన్నాయి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఆదివాసుల వ్యవహారిక భాషలు అనేకం వినిపిస్తుంటాయి. ఆయా భాషలు అంతరించపోకుండా వాటి వికాసం కోసం కృషి చేయడం ప్రభుత్వం బాధ్యత అని రాజ్యాంగం చెబుతుంది.

ఈ వాస్తవాలను, లక్ష్యాలను విస్మరించి హిందీ భాషను తప్పనిసరి భాషగా చేయాలన్న పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఆమోదయోగ్యం కాదు. కేంద్రీయ విద్యాసంస్థలలో హిందీని తప్పనిసరి భాషగా మొదట ప్రవేశపెట్టి, తరువాత క్రమక్రమంగా దేశమంతటా అమలు చేసే కుతంత్రం ఇది. కనుకనే హిందీయేతర ప్రాంతాలవారు ఈ సిఫార్సులను నిరసిస్తున్నారు. హిందీని తప్ప‌నిస‌రి భాషగా చేయడాన్ని కేవలం దక్షిణాదివారు మాత్రమే కాదు ఈశాన్య ప్రాంతాలవారు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఈశాన్య భారతంలో భాషావైవిధ్యం మరింత ఎక్కువ. ఒకసారి హిందీని బలవంతంగా రుద్దితే అక్కడి భాషలు వేగంగా అంతరించిపోయే ప్రమాదముంది.

భాషా వైవిధ్యాన్ని పరిరక్షించాలని, అల్పసంఖ్యాకులు మాట్లాడే భాషలు అంతర్థానం కాకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో కోరుతుంది. అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది ఆ సంస్థ. కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశంలో హిందీని బలవంతంగా రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు తెగ‌బ‌డ్డాయి. ప్రాంతాల మధ్య విభజనను తీసుకొచ్చి ఉత్తర భారతంలో తమ పునాదుల్ని మరింత గట్టిపరుచుకునే కాషాయ పరివారపు దుర్మార్గపు వ్యూహం దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్నది. 'భిన్నత్వంలో ఏకత్వం' అన్న సూత్రాన్ని విస్మరించి కేవలం హిందీని దేశభాషగా, ఒకే ఒక్క అధికార భాషగా అమలు చేయాలన్న కుటిల ఆలోచనలు అంతిమంగా దేశ సమైక్యతను దెబ్బతీస్తాయి. కనుకనే భాషలకు సంబంధించి అమిత్‌షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను వ్యతిరేకించడం సమాఖ్య స్ఫూర్తిని విశ్వసించే వారందరి కర్తవ్యం.

First Published:  14 Oct 2022 11:43 AM IST
Next Story