పెద్ద నోట్ల రద్దుపై విచారణకు సుప్రీం కోర్టు ఓకే ... కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
పెద్ద నోట్ల రద్దు పై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ రిజర్వు బ్యాంకును కోర్టు ఆదేశించింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
పెద్ద నోట్లు రద్దయి 6 ఏళ్ళు గడిచిపోయినందున దీనిపై ఇప్పుడు విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే ఇది భవిష్యత్తుకు కూడా సంబంధించిన అంశమని, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు అవుతుందా లేదా అనే విషయం నిర్ణయం చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పి చిదంబరం, శ్యామ్ దివాన్ వాదించారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వారు కోర్టుకు తెలిపారు.
పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, బిఆర్ గవాయి, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేసును విచారించడానికి అంగీకరించింది.
పిటిషనర్ల తరఫున హాజరైన పి చిదంబరం మాట్లాడుతూ నోట్ల రద్దు కారణంగా ప్రజలు నష్టపోయారని, వేతనాలు కోల్పోయారని, మందులు కొనలేక పోయారని, క్యూలో నిలబడి సుమారు 100 మంది మరణించారని అన్నారు. అనేక వ్యాపార యూనిట్లు మూతపడ్డాయని, అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయాయని ఆయన అన్నారు.
వాదనల అనంతరం కోర్టు పెద్ద నోట్లను రద్దు నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు తెలిపింది.