Telugu Global
National

మధ్యప్రదేశ్ లో ప్రియాంక 'పంచ' తంత్రం

ఇంజిన్ల గురించి మాట్లాడటం ఆపేసి ముందు పనిచేయాలని కర్నాటక ప్రజలు బీజేపీకి జ్ఞానోదయం కలిగించారని అన్నారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటికప్పుడు నెరవేర్చామని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో ప్రియాంక పంచ తంత్రం
X

ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ విజయం వెనక ఐదు హామీలు కీలకంగా పనిచేశాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదు కీలక హామీలపై ఫోకస్ పెట్టింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జబల్ పూర్ జిల్లా నుంచి ప్రారంభించిన ప్రియాంక గాంధీ.. 5 కీలక హామీలు ప్రకటించారు.

- రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం.

- రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్

- 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆపైన 200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్

- రైతుల రుణాలు మాఫీ

- పాత పెన్షన్‌ విధానం అమలు

నర్మదా నది ఒడ్డుకు వచ్చి తాను అబద్ధం చెప్పడంలేదన్న ప్రియాంక గాంధీ.. తాము అధికారంలోకి వస్తే ఆ ఐదు హామీలను కచ్చితంగా అమలు చేసి తీరతామన్నారు. ఇటీవల కర్నాటకలో కూడా కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినా భారీగా రేట్లు పెంచింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో మాత్రం 100 యూనిట్లు దాటినా 200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్ చార్జీలు వసూలు చేస్తామని క్లారిటీగా చెప్పారు ప్రియాంక.

బీజేపీ నేతలు హామీలు ఇస్తారే కానీ, వాటిని నెరవేర్చరని చెప్పారు ప్రియాంక గాంధీ. డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ గురించి మాత్రమే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇంజిన్ల గురించి మాట్లాడటం ఆపేసి ముందు పనిచేయాలని కర్నాటక ప్రజలు వారికి జ్ఞానోదయం కలిగించారని అన్నారు. కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటికప్పుడు నెరవేర్చామని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, బీజేపీ ధనబలంతో ప్రభుత్వాన్ని పడగొట్టిందని అన్నారు ప్రియాంక గాంధీ. మధ్యప్రదేశ్‌ లో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ 225 కుంభకోణాలు చేసిందని విమర్శించారు. గత మూడేళ్లలో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం ఒక అనౌన్సర్ మాత్రమేనని, ఆయన ఇప్పటి వరకు 22వేల ప్రకటనలు చేశారని, ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే 5 హామీలను వెంటనే నెరవేరుస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ.

First Published:  13 Jun 2023 2:17 AM GMT
Next Story