Telugu Global
National

ర‌న్‌వేపై జారి.. రెండు ముక్క‌లైన విమానం.. - 8 మందికి గాయాలు

ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి దృశ్యాలు క‌నిపించే ప‌రిస్థితి లేదని డీజీసీఏ వెల్లడించింది. రన్వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఈ ఘటన నేపథ్యంలో రన్‌వేను కొద్దిసేపు మూసివేశారు.

ర‌న్‌వేపై జారి.. రెండు ముక్క‌లైన విమానం.. - 8 మందికి గాయాలు
X

ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వేపై జారిపోయిన విమానం రెండు ముక్క‌లుగా విరిగిపోయిన ఘ‌ట‌న ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 8 మంది గాయాల‌పాల‌య్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విశాఖపట్నం నుంచి ముంబైకి బయల్దేరిన వీఎస్ఆర్ వెంచర్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానం ముంబైలో భారీ వ‌ర్షం కురుస్తున్న స‌మ‌యంలో ల్యాండింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది (పైలట్, కో-పైలట్, ఫ్లైట్ అటెండెంట్) ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో వారంతా గాయ‌ప‌డ్డారు.

ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి దృశ్యాలు క‌నిపించే ప‌రిస్థితి లేదని డీజీసీఏ వెల్లడించింది. రన్వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఈ ఘటన నేపథ్యంలో రన్‌వేను కొద్దిసేపు మూసివేశారు. ఆ సమయంలో ముంబైలో దిగాల్సిన తమ 5 విమానాలను వేరే ఇతర ప్రాంతాలకు మళ్లించినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. మొదటి రెండు విమానాలను హైదరాబాద్‌కు మళ్లించగా, తర్వాతి మూడు విమానాలను గోవాకు పంపించారు. సహాయక చర్యల అనంతరం.. డీజీసీఏ, ఏటీసీ అనుమతితో రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు. మరోవైపు.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

First Published:  15 Sept 2023 11:00 AM IST
Next Story