4 గంటల పెరోల్.. పెళ్లి చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన యువకుడు
రాహుల్ తన ప్రియురాలితో మార్చి 4వ తేదీన గోపాల్ గంజ్‌లోని ఓ గుడికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి వారిద్దరూ స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఏమైందో తెలియదు కానీ యువతి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.
అత్యాచార ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఓ యువకుడు నాలుగు గంటల పెరోల్‌పై బయటకొచ్చి బాధిత యువతిని పెళ్లి చేసుకున్నాడు. తిరిగి జైలుకెళ్లాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన రాహుల్ కుమార్ అనే యువకుడు హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. ఆ సమయంలో అతడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారు.
ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన రాహుల్ తన ప్రియురాలితో గోపాల్ గంజ్‌లోని ఓ గుడికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి వారిద్దరూ స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఏమైందో తెలియదు కానీ యువతి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. వారే స్థానిక పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి రాహుల్‌ను అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ 20 రోజులుగా జైల్లో ఉన్నాడు. తాను యువతిపై అత్యాచారం చేయలేదని, బాధిత యువతి, తాను ప్రేమలో ఉన్నట్లు రాహుల్ కోర్టుకు వివరించాడు. అనుమతి ఇస్తే బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని కోర్టును కోరాడు. ఇందుకు అనుమతి ఇచ్చిన కోర్టు నాలుగు గంటల పెరోల్‌పై రాహుల్‌ను విడుదల చేసింది. బయటకు వచ్చిన రాహుల్ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొని తిరిగి జైలుకు వెళ్లాడు. ప్రేమించిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం, జైలుకెళ్లి పెరోల్‌పై బయటకు వచ్చి బాధితురాలిని వివాహం చేసుకోవడం గోపాల్ గంజ్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.