'దేవుడా..చెడు నుంచి నన్ను రక్షించు..' అనే ప్రార్ధన చేయించినందుకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్
బరేలీ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ పిల్లలతో చేయించిన ప్రార్దన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, నిర్దేశించిన జాబితాలో ఆ ప్రార్ధన లేదని విద్యా శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. అంతేగాక పిల్లలు పాడిన ఈ ప్రార్ధనా గీతం వీడియో బయటికి రావడంతో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ఫిర్యాదు మేరకు ఆ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు.
"నా దేవుడా..చెడు నుంచి నన్ను రక్షించు" ( మేరే అల్లాహ్..బురాయీ సే బచానా ముఝే ) అని విద్యార్దులతో ప్రార్దన చేయించినందుకు ఓ ప్రభుత్వ పాఠాశాల ప్రిన్సిపాల్ ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బరేలీ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన పిల్లలతో చేయించిన ప్రార్దన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, నిర్దేశించిన జాబితాలో ఆ ప్రార్ధన లేదని విద్యా శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. అంతేగాక పిల్లలు పాడిన ఈ ప్రార్ధనా గీతం వీడియో బయటికి రావడంతో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) ఫిర్యాదు మేరకు ఆ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. పిల్లలు ఉదయం అసెంబ్లీలో ప్రసిద్ధ ఉర్దూ భాషా ప్రార్థన "ల్యాబ్ పే ఆతీ హై దువా బన్ కే తమన్నా మేరీ" పాడిన గీతం విస్తృతంగా ప్రచారం అయింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని విద్యా శాఖ పేర్కొంది.
ప్రఖ్యాత ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ 1902లో రాసిన ఈ గీతంలోని కొన్ని ప్రత్యేక వాక్యాలు "మేరే అల్లాహ్..బురాయీ సే బచానా ముఝే" పట్ల విహెచ్ పి ఫిర్యాదు చేసింది. ఇది ఒక మతానికి సంబంధించినదని, మదర్సాలలో చేయించే ప్రార్ధన అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రిన్సిపాల్ విద్యార్దులను మతాంతీకరణకు ప్రేరేపిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. విచిత్రమేమిటంటే .."సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా" అనే ప్రసిద్ధ గీతం కూడా ఇక్బాల్ రాసిందే కావడం గమనార్హం.
2019లో, రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో ఒక ప్రధానోపాధ్యాయుడు కూడా విద్యార్థులతో ఈ తరహా గీతాన్ని పాడించారనే కారణంగా సస్పెన్షన్ కు గురయ్యారు. అప్పుడు కూడా విశ్వహిందూ పరిషత్ స్థానిక యూనిట్ ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే విద్యార్ధులతో జాతీయ గీతం పాడించనుందుకే ఆయన్ను సస్పెండ్ చేశారని అప్పటి జిల్లా కలెక్టర్ చెప్పినట్టు వార్తలు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గత నెలలో కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని ఓ ప్రవేటు పాఠశాలలో జరిగిన క్రీడా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 'ఆజాన్స ( ప్రార్దనలకు రావాలనే పిలుపు) ప్రదర్శన చేశారు. దీనిపై విహెచ్ పి కార్యకర్తలు ఆ పాఠశాల యాజమాన్యం ఎదట నిరసన ప్రదర్శనలు చేసి రచ్చ సృష్టించారు. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.
ఈ సంఘటనలన్నీ బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే జరగడం గమనార్హం. మత సామరస్యం కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న బిజెపి ప్రబుత్వాలు దేవుడికి కూడా మతం రంగు పూయడం శోచనీయం.