Telugu Global
National

నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనం సరికాదు.. - కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌

ఈ పరీక్షను సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సిబల్‌ సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్‌ విజ్ఞప్తి చేశారు

నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనం సరికాదు.. - కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌
X

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రధాన మంత్రి మౌనంగా ఉండటం సరికాదని కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా దీనిపై స్పందించి.. నీట్‌లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అంతేకాదు.. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సిబల్‌ సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది చర్చకు రాకపోవచ్చని, కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వం దీనిని అనుమతించకపోవచ్చని ఆయన చెప్పారు. నీట్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించి గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాలు జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే స్వతంత్ర దర్యాప్తు బృందం లేదా ప్రభుత్వంతో సంబంధం లేని నిపుణులతో ఈ పరీక్ష నిర్వహణపై దర్యాప్తు జరిపించాలన్నారు.

First Published:  17 Jun 2024 1:20 PM IST
Next Story