రాజ్యాంగమే రక్ష.. సివిల్ కోడ్ ఎందుకు దండగ..!
ప్రధాని తన వ్యాఖ్యల ద్వారా ముస్లింలను తాము కేవలం ఓటు బ్యాంకులా మాత్రమే చూడటం లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అమెరికా నుంచి వస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వివాదానికి తెరతీశారు. భోపాల్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమైన ప్రధాని.. ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
ఒక దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు ప్రధాని మోదీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా నేటికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) అమలుకావడం లేదన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని బూచీగా చూపిస్తూ, కొందరు ముస్లింలను రెచ్చగొడుతున్నారన్నారు. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందని గుర్తు చేసిన ప్రధాని, కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ వ్యవస్థ దేశ పురోగనమనంపై ప్రభావం చూపుతుందన్నారు.
ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా మాట్లాడేవారు ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు. ట్రిపుల్ తలాక్, ఇస్లాంలో అతి ముఖ్యమైన భాగమై ఉంటే, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా వంటి ముస్లిం మెజారిటీ దేశాలలో ఎందుకు నిషేధించారని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళల స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ప్రధాని ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నందునే ముస్లిం మహిళలు, ఆడబిడ్డలు బీజేపీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రధాని తన వ్యాఖ్యల ద్వారా ముస్లింలను తాము కేవలం ఓటు బ్యాంకులా మాత్రమే చూడటం లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కాగా.. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, డీఎంకే, ఎంఐఎం పార్టీలు తప్పుబట్టాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకే వర్తింప చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే హిందువులు గుళ్లలోకి అన్ని వర్గాలను అనుమతిస్తారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు సహా ప్రతి వ్యక్తి దేశంలోని ఏ ఆలయంలోనైనా పూజలు చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.
డీఎంకే నేత ఇళంగోవన్ సైతం ప్రధాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగమే ప్రతి మతానికీ రక్షణ కల్పించిందని, కాబట్టి తమకు ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదన్నారు. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రధాని మోదీ ఘాటు రిప్లయ్ ఇచ్చారు. దమ్ముంటే ఉమ్మడి పౌర స్మృతిని పంజాబ్‌లో అమలు చేయాలని సవాల్ విసిరారు. ముస్లిం విధానాలన్నీ చట్టవ్యతిరేకమైనవన్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని, ఇది సరైన వైఖరి కాదని ఓవైసీ అన్నారు.