Telugu Global
National

రాజకీయ సుస్థిరత ఫలితాలు మనం చూస్తున్నాం - ప్రధాని సందేశం..

స్వాతంత్రం సిద్ధించిన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు మోదీ. మన ముందు ఉన్న మార్గం కఠినమైందని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు.

రాజకీయ సుస్థిరత ఫలితాలు మనం చూస్తున్నాం - ప్రధాని సందేశం..
X

భారతీయులందరికీ ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. ఈ ఉదయం రాజ్‌ ఘాట్‌ లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులులర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు మోదీ. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఆహుతులపై పూల వర్షం కురిపించాయి.

అమృత మహోత్సవం..

అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. దేశ నలుమూలలా ఎంతోమంది వీరులను స్మరించుకునే రోజు ఇదని చెప్పారాయన. జీవితాలనే త్యాగం చేసిన వారి ప్రేరణతో నవ్యదిశలో పయనించాలన్నారు. కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వందల ఏళ్ల బానిసత్వంతో భారతీయతకు భంగం కలిగిందని, భారతీయ భావన గాయపడిందని అన్నారు. స్వాతంత్రం సిద్ధించిన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు మోదీ. మన ముందు ఉన్న మార్గం కఠినమైందని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. బానిస సంకెళ్ల ఛేదనలో మహనీయుల పోరాటం అనుపమానమని కొనియాడారు మోదీ. గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌ వంటివారు మార్గదర్శకులని చెప్పారు. మహనీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తి అని అన్నారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని యువతను కోరారు మోదీ. 2047 నాటికి నేటి యువతకు 50 ఏళ్లు నిండుతాయని, స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోని ప్రతిఒక్క పేదవారికి సహాయం అందేలా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలమన్నారు.

రాబోయే 25 ఏళ్లలో ఈ 5 అంశాలు కీలకం..

1. దేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి.

2. బానిసత్వపు ఆలోచన మనసు పొరల్లోనుంచి తీసిపారేయాలి.

3. మనదేశ చరిత్ర , సంస్కృతి చూసి గర్వపడాలి.

4. ఐకమత్యంతో ప్రజలంతా కలిసి పనిచేయాలి.

5. ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తుంచుకుని పనిచేయాలి అని పిలుపునిచ్చారు మోదీ.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ సహా ఇతర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అతిథులు పాల్గొన్నారు.

First Published:  15 Aug 2022 3:33 AM GMT
Next Story