Telugu Global
National

రాజనీతిజ్ఞత లోపించిన ప్రధాని ప్రసంగం

మోదీ ప్రసంగం మొదలు పెట్టినప్పట్నించి కాంగ్రెస్‌ మీద, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ మీద విరుచుకుపడ్డారు. ఒక గంట 40 నిమిషాల పాటు కాంగ్రెస్‌పై, ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టడమే తప్ప మణిపూర్‌ ప్రస్తావనే తీసుకురాలేదు.

రాజనీతిజ్ఞత లోపించిన ప్రధాని ప్రసంగం
X

విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం చేసిన సుదీర్ఘ ప్రసంగం ఎన్నికల స్పీచ్‌ని తలపించింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఈ ప్రసంగంతోనే తన ప్రచారాన్ని ప్రారంభించినట్టుగా వుంది. రెండు గంటల 13 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌ను, ప్రతిపక్షాలను, రాహుల్‌ గాంధీని విమర్శించడానికి అధిక సమయం కేటాయించారు మోదీ. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి నుంచి రాజనీతిజ్ఞతతో కూడిన జవాబును, ప్రసంగాన్ని ఆశిస్తాం. ప్రతిపక్షాలు ఏ అంశాలు చర్చకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాయో వాటి గురించి ప్రస్తావించి నిర్దిష్టంగా జవాబు చెబితే హుందాగా ఉండేది. దీనికి భిన్నంగా నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాజనీతిజ్ఞతనీ, రాజధర్మాన్ని విస్మరించింది.

ముఖ్యంగా మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి తాము ఏం చేస్తామో, మణిపూర్‌కు సంబంధించిన తమ రోడ్‌ మ్యాప్‌ ఏమిటో స్పష్టంగా, మరింత నిర్దిష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మీద ఉంది. కానీ మణిపూర్‌లో శాంతికి హామీ తనది హామీ అనడమే తప్ప, ఆ శాంతి సాధనకు తాము ఎలాంటి చర్యలు చేపడతారో మోదీ చెప్పలేకపోయారు. అంతేగాక మణిపూర్‌లో తాజా హింసాగ్నికి కూడా కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆరోపించారు. మణిపూర్‌లో ప్రధాని ఎందుకు పర్యటించలేకపోతున్నారని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గోగయ్‌ ప్రశ్నకు జవాబు లేదు. ఈశాన్య రాష్ట్రాలలో 50 సార్లకు పైగా పర్యటించానని చెప్పిన మోదీ, ఇప్పుడయినా తాను మణిపూర్‌లో పర్యటిస్తానని మాత్రం అనలేకపోయారు.

మోదీ ప్రసంగం మొదలు పెట్టినప్పట్నించి కాంగ్రెస్‌ మీద, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ మీద విరుచుకుపడ్డారు. ఒక గంట 40 నిమిషాల పాటు కాంగ్రెస్‌పై, ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టడమే తప్ప మణిపూర్‌ ప్రస్తావనే తీసుకురాలేదు. దీనితో అంతసేపు ప్రధాని దూషణల పర్వం విన్న ప్రతిపక్షాలు విధిలేక వాకౌట్‌ చేశాయి. ప్రతిపక్ష సభ్యులు బయటికి వెళుతుంటే ప్రధాని ప్రసంగం వినే సహనం కూడా ప్రతిపక్షాలకు లేదంటూ, అప్పుడు మణిపూర్‌ విషయం ప్రస్తావించారు నరేంద్ర మోదీ. మొత్తం తన ప్రసంగంలో 10 నిమిషాలు మాత్రమే మణిపూర్‌ గురించి మాట్లాడారు. ఆ మాటల్లోనూ అక్కడ శాంతిస్థాపనకు సంబంధించిన నిర్దిష్ట ప్రతిపాదనల్ని వివరించలేకపోయారు. ముఖ్యంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించపోవడం గమనార్హం.

దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందన్న ప్రధాని నిరుద్యోగ నిర్మూలనకు ఏం చేయగలమో చెప్పలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు జవాబులు చెప్పకుండా ‘ఇండియా’ కూటమి అవినీతిపరుల కూటమి అని ఈసడించడం, యాభై ఏళ్ళ కాంగ్రెస్‌ పాలన, నెహ్రూ కుటుంబ పాలన దేశాన్ని నాశనం చేసిందని చర్వితచరణంగా నరేంద్రమోదీ మాట్లాడారు. రాహుల్‌ గాంధీని ‘ఫెయిల్డ్‌ ప్రొడక్డ్‌’ అంటూ ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలని తప్పుపడుతూ కాంగ్రెస్‌ మీద వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధించడం తప్ప ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయారు.

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం మీద ప్రధాని మాట్లాడుతున్నారంటే ఎంతో హుందాగా ఉండాలి. రాజనీతిజ్ఞతని తలపించాలి. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌దే పాపం అంతా అన్నట్టు రెండు గంటలకు పైగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మండుతున్న మణిపూర్‌లో హింసాద్వేషాలు చల్లారడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదో ప్రధాని ప్రసంగంలో లేకపోవడం ఆశ్చర్యకరం. తమ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు చర్చకు సరిగా సిద్ధం (ప్రిపేర్‌) కాలేదని విమర్శించారు నరేంద్ర మోదీ. కానీ మణిపూర్‌ అంశమే ప్రధానంగా చేసుకొని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడానికి మోదీ ఏ విధంగానూ ప్రిపేర్‌ కాలేదని ప్రసంగమంతా విన్నవారికి సులువుగా బోధపడుతుంది.

ఇక ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ను, ‘ఇండియా’ కూటమిని విమర్శించినప్పుడల్లా అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ నినాదాలు చేయడం, ప్రధాని వ్యంగ్యాస్త్రాలకు మూకుమ్మడిగా వంత పలకడం ఎంతమాత్రం హుందాగా లేదు. ఎన్నికల సభల్లో పార్టీ కార్యకర్తల మాదిరిగా నినాదాలతో, అరుపులతో, కేకలతో సభను హోరెత్తించడం చౌకబారుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాల ఆరోపణలకు, ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పంతా వారిదే అన్నట్టుగా మాట్లాడటం రాజనీతిజ్ఞత అనిపించుకోదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారే స్టేట్స్‌మన్‌షిప్‌తో వ్యవహరించకపోతే పార్లమెంటరీ సంప్రదాయాలకు ఏం విలువ ఉంటుంది? పార్లమెంటులో వారు చేసే ప్రసంగాలకు ఏం గౌరవం దక్కుతుంది? మోదీ ప్రసంగం మిగిల్చిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?

First Published:  11 Aug 2023 8:22 AM IST
Next Story