Telugu Global
National

కందుకూరు ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

కందుకూరు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున‌ ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

కందుకూరు ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన
X

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్ర‌బాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. కందుకూరు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున‌ ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

కందుకూరులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమంలో భాగంగా ఓ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. కాగా, తమ సభకు జనం భారీగా తరలివచ్చారని చెప్పుకునేందుకు ఇరుకైన సందుల్లో టీడీపీ నేతలు సభ నిర్వహించారని ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్ర‌బాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న చంద్రబాబు సభకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. సభకు తగిన భద్రత కల్పించి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని వారు విమర్శిస్తున్నారు. కాగా కందుకూరు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.

First Published:  29 Dec 2022 6:04 AM GMT
Next Story