Telugu Global
National

మోదీ ఫొటో పెట్టాల్సిందే.. కానీ రేషన్ షాపుల ముందు కాదు..

2050 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అప్పుడు ఎవరూ ఆకలితో పడుకునే అవసరం ఉండదని ఇటీవల సెలవిచ్చారు మోదీ చలవతో భారీ లాభాలు పొందిన గౌతమ్ అదానీ. ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగితే లాభం ఎవరికి..? కేవలం కార్పొరేట్ల వృద్ధికి అది అవసరం.

మోదీ ఫొటో పెట్టాల్సిందే.. కానీ రేషన్ షాపుల ముందు కాదు..
X

రేషన్ షాపు ముందు ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేదంటూ.. తెలంగాణలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చిందులు తొక్కడం చాలామందికి వింతగా అనిపించి ఉండొచ్చు. కేంద్ర మంత్రులు తమ చీప్ మెంటాలిటీని ఇలా బయటపెట్టుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. రేషన్ బియ్యం మోదీ వేసే బిచ్చం కాదని, అది పేదవాడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనే ఘాటు వ్యాఖ్యలు కూడా వినపడ్డాయి. కానీ కేంద్రం దృష్టిలో సంక్షేమం అంటే వేరే అర్థముంది. సంక్షేమం అంటే పేదల కడుపు నింపేది కాదు, పెద్దల అప్పులు తీర్చేది, కార్పొరేట్ల కొమ్ముకాసేది. కేంద్రం దృష్టిలో సంక్షేమం అంటే అదే.

20కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ ప్రతిరోజూ అర్థాకలితో పడుకుంటున్నారు. వారికి కూడా కడుపునిండా అన్నం పెట్టగలిగితే.. ప్రతి రేషన్ షాపు ముందే కాదు, ప్రతి ఇంటిలోనూ మోదీ ఫొటో పెట్టొచ్చు. 5.4కోట్ల మంది నిరుద్యోగులు భారత్ లో ఉద్యోగాలకోసం వెదుకుతున్నారు. గతంలో ఎప్పుడూ భారత్ లో నిరుద్యోగత రేటు ఈ స్థాయిలో లేదు. కనీసం వారిలో సగం మంది యువకులకైనా ఉద్యోగం చూపించగలిగితే అప్పుడు మోదీ ఫొటో పెట్టొచ్చు. కానీ ఖాళీ కడుపులు, ఖాళీ జేబులతో మోదీ ఫొటో ఎందుకు పెట్టాలి..? ఎక్కడ పెట్టాలి..?

మోదీ ఫొటో పెట్టాల్సిందే.. ఎక్కడంటే..?

కరోనా కారణంగా దేశ ప్రజలు అల్లాడిపోతుంటే.. చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. కానీ భారత్ లో 20 కంపెనీలు మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా లాభపడ్డాయి. మూడు రెట్లు తమ సంపద పెంచుకున్నాయి. ఆ కంపెనీలన్నీ తమ కార్యాలయాల్లో మోదీ ఫొటో పెట్టుకోవాల్సిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, గత 8 ఏళ్లలో కార్పొరేట్ రంగానికి 1.45 లక్షల కోట్ల భారీ బహుమతి అందించారు మోదీ. రుణ మాఫీలు, రాయితీల రూపంలో కంపెనీలకు కొమ్ముకాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కేంద్రం కేటాయించిన బడ్జెట్ కంటే ఇది పదిరెట్లు అధికం కావడం నిజంగా సిగ్గుచేటు. పేదల్ని కొట్టి పెద్దలకు పెట్టడం అనే సూత్రం ఆధారంగానే కేంద్రం పనిచేస్తోంది.

కొవిడ్ కారణంగా ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారు. కానీ కార్పొరేట్లకు మాత్రం రోగనిరోధక శక్తిని పెంచుకునే బలవర్థకమైన ఆహారం కూడా ఇచ్చారు మోదీ. అందుకే కరోనా టైమ్ లో భారత్ లో పేదలు మరింత నిరుపేదలుగా మారిపోతే, కోటీశ్వరుల సంఖ్య మాత్రం పెరిగింది. భారత్ లో బిలియనీర్ల మొత్తం సంపద 53.16 లక్షల కోట్లకు పెరిగింది. మేకిన్ ఇండియా అనేది పెద్ద జోక్ గా మారింది. కనీసం అన్నం పెట్టే రైతన్నని సైతం పట్టించుకోలేదు మోదీ ప్రభుత్వం. కార్మికుల వేతనాలు కరిగిపోయాయి. కార్పొరేట్ శక్తులతో పోరాడే సామర్థ్యం చిన్న కంపెనీలకు లేకుండా పోయింది. కారణం ఇలాంటి వారంతా అప్పులు కట్టకుండా తప్పించుకోలేకపోవడమే. బడా కార్పొరేట్లకు మాత్రం బ్యాంకులతో రుణ మాఫీలు ప్రకటించింది కేంద్రం.

అదానీ జోక్ ఇది..

2050 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అప్పుడు ఎవరూ ఆకలితో పడుకునే అవసరం ఉండదని ఇటీవల సెలవిచ్చారు మోదీ చలవతో భారీ లాభాలు పొందిన గౌతమ్ అదానీ. ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగితే లాభం ఎవరికి..? కేవలం కార్పొరేట్ల వృద్ధికి అది అవసరం. తమ లాభాలను రికార్డ్ స్థాయిలో పెంచుకోడానికి, పోటా పోటీగా ఆవిష్కరణలను తెరపైకి తీసుకు రావడానికి ఈ అభివృద్ధి అవసరం. కానీ నిరుపేదలకు వీటివల్ల ఉపయోగం ఏంటి..? వారికి ఉపాధి అవకాశాలు పెరగవు, ఉచితంగా ఇచ్చే బియ్యం విషయంలో కూడా మోదీ ఫొటోకోసం రాద్ధాంతం చేస్తున్న కేంద్రం.. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగినా తన చీప్ మెంటాలిటీని మార్చుకుంటుందా..?

సగం మంది పేదలు భారత్ లోనే..

కరోనా సమయంలో భారత్ లో కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని, ఆర్థికంగా మన దేశం ఎంత స్థిరంగా ఉందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రం.. అదే సమయంలో 4.6 కోట్ల మంది భారతీయులు కొత్తగా పేదరికంలో కూరుకుపోవడాన్ని ఎందుకు కప్పిపెట్టాలని చూస్తోంది. ప్రపంచంలో కొత్తగా పుట్టుకొచ్చిన పేదల్లో సగం మంది భారత్ నుంచే ఉన్నారని అంటున్న ఐక్యరాజ్య సమితి హెచ్చరికను ఎందుకు సీరియస్ గా పరిగణించడంలేదు. ఏడేళ్లలో భారత్ లో నిత్యావసరాల ధరలు 50శాతం పెరిగాయి, కానీ వేతనాలు మాత్రం 22 శాతమే పెరిగాయి. అంటే పేదలతోపాటు, మధ్యతరగతి కూడా బాగా చితికిపోయిందని అర్థం. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో సగటు భారతీయుడు ఉన్నాడు. పరిస్థితి ఇలా ఉంటే.. రేషన్ షాపు ముందు మోదీ ఫొటో లేదని నిర్మలమ్మ శివాలెత్తడం మాత్రం మరింత దారుణంగా ఉంది.

First Published:  7 Sept 2022 3:09 PM IST
Next Story