Telugu Global
National

అందంగా.. అపురూపంగా.. ఎన్నెన్నో.. ప్రధానమంత్రి మెమెంటోల వేలం నేటినుంచే

ప్రధానమంత్రికి లభించిన 1,222 మెమెంటోలను నేటినుంచి వేలం వేయనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే ఈ వేలం అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

అందంగా.. అపురూపంగా.. ఎన్నెన్నో.. ప్రధానమంత్రి మెమెంటోల వేలం నేటినుంచే
X

ప్రధానమంత్రి పర్యటనలకు వెళ్లినప్పడు, ఎవరైనా ఆయన్నికలిసినప్పుడు గౌరవార్థం మెమెంటోలు ఇవ్వడం చూస్తుంటాం. ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. అవి మన మనసును దోచుకుంటాయి కూడా. ఇప్పుడు ఆ మెమెంటోలను ఎవరైనా దక్కించుకునే అవకాశం లభించింది.

ప్రధానమంత్రికి లభించిన 1,222 మెమెంటోలను నేటినుంచి వేలం వేయనున్నారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే ఈ వేలం అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నాలుగో విడతగా నిర్వహిస్తున్న ఈ ఆన్ లైన్ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు. నచ్చినదాన్ని దక్కించుకోవచ్చు. వీటి వేలంతో సమకూరే సొమ్మును గంగానదిని పరిశుభ్రం చేసే నమామి గంగ పథకానికి ఉపయోగిస్తారు. ఈ చిత్రాలను, వేలం ప్రారంభ ధర, ఇతర వివరాలను ఆన్ లైన్ లో ఉంచారు. క్రీడాపరికరాలు, ప్రముఖుల ఆటోగ్రాఫులున్న టీషర్టులు, విగ్రహాలు, దేవతా విగ్రహాలు, నమూనాలు, చిత్రాలు, చిత్రపటాలు, బొమ్మలు, సంగీత పరికరాలు, వస్త్రాలతో చేసినవి.. వంటివి ఉన్నాయి. వీటి వేలం ప్రారంభ ధర రూ.5,400 నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.

వీటిలో ప్రారంభధరను బట్టి మొదటి ఐదు మెమెంటోల వివరాలు..

1. రూ.10 లక్షల అత్యధిక ప్రారంభ ధరలో టీషర్టు ఉంది. టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకున్న మనీశ్ నర్వాల్ ఆటోగ్రాఫ్ తో ఉన్న తెలుపు, నీలి రంగుల్లో ఉన్న ఆయన టీషర్టు మీద మన దేశ పారా ఒలింపిక్ కమిటీ లోగో, భారత జాతీయ పతాకం ఉన్నాయి.

2. రూ.5 లక్షల ప్రారంభ ధరలో 15 మెమెంటోలున్నాయి. వీటిలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఒకటి. ఆయన మిలటరీ యూనిఫాంలో ఒకచేతిని కత్తిమీద ఉంచి మరోచేత్తో సెల్యూట్ చేస్తున్నఈ విగ్రహాన్నిబ్లాక్ మార్బుల్ తో రూపొందించారు. 61 సెంటీమీటర్ల ఈ విగ్రహం బరువు 2 కిలోల 350 గ్రాములు.

ఇంకా రూ.5 లక్షల ప్రారంభ ధరలో ఈ ఏడాది కామన్వెల్త్‌ పోటీల్లో పాల్గొన్న భారత మహిళలు, పురుషుల రెజ్లింగ్ జట్ల ఆటోగ్రాఫ్ లతో ఉన్న టీషర్టు, ఈ ఏడాది థామస్ కప్ గెల్చుకున్న క్రీడాకారుల ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాడ్మింటన్ బ్యాగ్, థామస్ కప్ లో బంగారు పతక విజేత కె.శ్రీకాంత్ సంతకం చేసిన బ్యాడ్మింటన్ రాకెట్, బాక్సింగ్ గ్లోవ్ స్ రెండు సెట్లు, పోలీస్ మెమోరియల్, టేబుల్ టెన్నిస్ రాకెట్, టీషర్టులు తదితరాలున్నాయి.

3. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ లయన్ మస్కట్ ప్రారంభధర రూ.3 లక్షలు. ఇదే ధరలో హాకీ టీం టీషర్టు ఉంది.

4. కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకం గెల్చుకున్న అన్నురాణి ఉపయోగించిన జావలిన్ ప్రారంభధర రూ.2.5 లక్షలు. ఇదే ధరలో మహిళా హాకీ జట్టు ఆటోగ్రాఫ్ లతో ఉన్న టీషర్టు ఉంది.

5. వీణ. వెండితో రూపొందించిన ఈ వీణ బరువు 4 కిలోలు కాగా దీని పొడవు 52 సెంటీమీటర్లు. వేలంలో ఈ విగ్రహం ప్రారంభ ధర రూ.2.16 లక్షలు.

6. వెండి కత్తి. 13 సెంటీమీటర్ల పొడవున్న దీని బరువు 1,600 గ్రాములు. దీని వేలం ప్రారంభ ధర రూ.1.62 లక్షలు.

7. ఫ్రేమ్ లో బిగించిన స్విమ్మింగ్ క్యాప్. నలుగురు స్విమ్మర్ల పేర్లు ఉన్న దీని ప్రారంభ ధర రూ. 1.5 లక్షలు.

8. హనుమంతుడి విగ్రహం. అందంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహం ప్రారంభ ధర రూ.1.35 లక్షలు.

9. దేవీచిత్రపటం. పట్టుచీర కట్టుకుని బంగారు నగలతో సర్వాలంకారభూషిత అయిన అమ్మవారి చిత్రపటాన్నిఅద్దాలతో చెక్కఫ్రేమ్ లో బిగించారు. 50 సెంటీమీటర్ల ఎత్తున్నఈ చిత్రపటం బరువు 4.5కిలోలు. వేలంలో దీని ప్రారంభధర రూ.1.08 లక్షలు. ఇదే ధరలో ఫ్రేమ్ లో బిగించిన శంఖం ఉంది. దీనిపై మధ్యలో విశ్వరూపం, చుట్టూ దేవతామూర్తుల బొమ్మలు ఉన్నాయి.

10. ద్యుతీచంద్ ఆటోగ్రాఫ్ ఉన్న మస్కట్ టాయ్ ధర రూ.1 లక్ష. ఇదే ధరలో సైకిల్ నమూనా ఉంది.

First Published:  17 Sept 2022 4:02 AM
Next Story