కొత్త పార్లమెంటు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని విజిట్ చేసిన ఫొటోలు బయటకు వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు గంట సేపు సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎం మోడీ సర్‌ప్రైజ్ విజిట్ చేశారు. గంట సేపు అక్కడే గడిపిన మోడీ.. పలు పనులను తనిఖీ చేశారు. ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని విజిట్ చేసిన ఫొటోలు బయటకు వచ్చాయి. పార్లమెంటులోని హాల్స్, లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్లేస్, కమిటీ రూములు అందంగా కనిపించాయి. అక్కడ పని చేస్తున్న నిర్మాణ కార్మికులతో కూడా మోడీ కాసేపు మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనం గతేడాది నవంబర్‌లోనే అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కోవిడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోవడంతో నిర్మాణం ఆలస్యమవుతోంది.
ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలియజేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 'సెంట్రల్ విస్టా'ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం భారత ప్రజాస్వామ్య వారసత్వం ఉట్టిపడేలా రూపొందించారు. ఎంపీల కోసం పెద్ద లాంజ్, ఒక లైబ్రరీ, ఒక్కో కమిటీ కోసం ఒక్కో విశాలమైన రూమ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లతో పాటు.. ప్రధాన మంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కూడా ఇక్కడే కొలువు తీరనున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ భారీ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. రెండేళ్లలో పూర్తి కావల్సి ఉన్నా.. ఏడాది ఆలస్యం అయ్యింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రారంభించి.. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు... వీలుంటే ఈ ఏడాది శీతాకాల సమావేశాలు అందులోనే నిర్వహించాలని భావిస్తున్నారు.