ప్రచారం ఫుల్.. సహాయం నిల్.. రైతుల పేరుతో మోదీ షో
2021 లో 7.37 కోట్లమందికి రుణాలిచ్చారు. అంటే మూడున్నర లక్షలమంది తగ్గారు. కానీ మోదీ మాత్రం రెండు కోట్ల మందికి అధికంగా రుణాలిచ్చామని చెబుతున్నారు. ఇదెక్కడి మోసం.
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా కరోనా తర్వాత 2 కోట్ల మంది రైతులకు కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డు కింద బ్యాంక్ లోన్లు ఇచ్చినట్లు కేంద్రం భారీగా ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవాలు చూస్తే మాత్రం లోన్ల పేరుతో రైతులకు సున్నం పెట్టారు మోదీ. 2014 లో 7.41 కోట్లమంది రైతులు బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్లు పొందారు. 2021 లో 7.37 కోట్లమందికి రుణాలిచ్చారు. అంటే మూడున్నర లక్షలమంది తగ్గారు. కానీ మోదీ మాత్రం రెండు కోట్ల మందికి అధికంగా రుణాలిచ్చామని చెబుతున్నారు. ఇదెక్కడి మోసం.
అధికారిక లెక్కలే..
కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం 7,37,69,951 మంది రైతులు కిసాన్ క్రెడిట్ కింద బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 7.41కోట్ల మంది రుణాలు తీసుకున్నట్టు నోడల్ ఏజెన్సీ నాబార్డ్ - 2016 నివేదిక స్పష్టం చేస్తుంది. ఇవన్నీ అధికారిక లెక్కలే. మరి ఈ లెక్కలు బయటపడినా కూడా కేంద్రం బుకాయించడం మాత్రం విచిత్రం. 50శాతానికి పైగా రైతులు ఇంకా వడ్డీ వ్యాపారుల వద్దే రుణాలకోసం క్యూ కడుతున్నారు.
బ్యాంక్ ల ప్రేమ ఎవరిపై..?
రైతులకు రుణాలివ్వడంలో కఠినంగా ఉంటున్న బ్యాంక్ లు, కార్పొరేట్ల రుణమాఫీల విషయంలో మాత్రం ఉదారంగా ఉంటున్నాయి. వీటికి కేంద్రం వత్తాసు పలకడం మరింత దారుణం. కేవలం రుణాల విషయంలోనే కాదు, పీఎం కిసాన్ విషయంలోనూ కేంద్రం రైతులకు న్యాయం చేయడంలేదు. కౌలు రైతులను పరిగణలోకి తీసుకోవడంలేదు. పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలనుంచి సాయం అందుతున్న రైతుల సంఖ్య కంటే తక్కువే. అంటే రాష్ట్రాలు రైతులకు ఉదారంగా సాయం చేస్తుంటే, కేంద్రం మాత్రం కొర్రీలు వేస్తూ లబ్ధిదారుల సంఖ్యను పరిమితంగానే ఉంచుతోంది. రైతులకు పెట్టుబడి సాయం చేయక, రుణాలు ఇవ్వక.. కేంద్రం ఇబ్బంది పెడుతోంది.