Telugu Global
National

అరుణాచ‌ల్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రారంభించిన మోదీ

విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం ఎన్నికల జిమ్మిక్కు అని 2019లో రాజకీయ విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఈ రోజు ఎన్నికలు లేవు, మేము ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం" అని ప్రధాని ప్ర‌తిప‌క్షాల‌నుద్దేశించి మాట్లాడారు

అరుణాచ‌ల్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రారంభించిన మోదీ
X

అరుణాచల్ ప్ర‌దేశ్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి మోదీ శ‌నివారం ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోలోంగి వ‌ద్ద ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం, సరిహద్దు రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ నగరాలకు విమాన ప్ర‌యాణ సేవ‌ల‌ను అందిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తుంది. ఈ విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో మోదీ శంకుస్థాపన చేశారు.

ఈశాన్య రాష్ట్రం పశ్చిమ కమెంగ్ జిల్లాలో 600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధాని నరేంద్ర మోదీ శ‌నివారం జాతికి అంకితం చేశారు. రూ.8,450 కోట్లకు పైగా వ్యయంతో 80 చద‌ర‌పు కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుందని మోదీ అన్నారు. "కనెక్టివిటీ, ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కొత్త పుంత‌లు తొక్కుతుంది" అని ప్రారంభోత్స‌వ స‌భ‌లో మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

"విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం ఎన్నికల జిమ్మిక్కు అని 2019లో రాజకీయ విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఈ రోజు ఎన్నికలు లేవు, మేము ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం" అని ప్రధాని ప్ర‌తిప‌క్షాల‌నుద్దేశించి మాట్లాడారు. ఈ కొత్త ప్రాజెక్టులతో దాదాపు 20 లక్షల మందికి సేవలంద‌డంతోపాటు, కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ పాల్గొన్నారు.

First Published:  19 Nov 2022 9:14 AM GMT
Next Story