Telugu Global
National

తెలంగాణ ఓట్ల కోసమే బాబుకి క్షమాభిక్ష..?

అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. బాబు ముదురు అయితే, మోదీ మహా ముదురు. ఊరకనే ఏ పనీ చేయరు, బాబు క్షమాభిక్ష వెనక కూడా రాజకీయ కోణం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణ ఓట్ల కోసమే బాబుకి క్షమాభిక్ష..?
X

నాలుగేళ్లుగా చంద్రబాబుని దూరం పెట్టిన ప్రధాని నరేంద్రమోదీ.. హఠాత్తుగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆయన్ని ఢిల్లీకి ఆహ్వానించి మరీ పలకరించారు. ఒక రకంగా నాలుగేళ్లుగా విధించిన శిక్షను రద్దు చేస్తూ క్షమాభిక్ష పెట్టినట్టు వ్యవహరించారు. మోదీ, బాబు భేటీలో ఏం జరిగింది..? ఏమేం మాట్లాడుకున్నారనే విషయం పక్కనపెడితే.. అసలు బాబుకి ఢిల్లీ ఆహ్వానం అందడమే అరుదైన విషయం, మోదీ పలకరించడమే గొప్ప ఊరట. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. బాబు ముదురు అయితే, మోదీ మహా ముదురు. ఊరకనే ఏ పనీ చేయరు, బాబు క్షమాభిక్ష వెనక కూడా రాజకీయ కోణం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

ఓటుబ్యాంక్ పై కన్ను..

తెలంగాణలో టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో ఫిక్స్ డ్ ఓటుబ్యాంక్ ఉంది. సామాజిక వర్గం అనుకోండి, ఏపీనుంచి వెళ్లిన సెటిలర్లు అనుకోండి, ఎన్టీఆర్ అభిమానులు అనుకోండి.. సైకిల్ గుర్తు అంటే వారిలో కాస్తో కూస్తో అభిమానం ఉంది. ఆ అభిమానం 2014 ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఆ అభిమానం మరీ ఎక్కువ. ఇప్పుడు ఆ అభిమానాన్ని, ఓటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మోదీ. తెలంగాణలో ఎన్నికలు మరో ఏడాదిలో వస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబుని కాస్త దగ్గరకు తీస్తే, తెలంగాణలో టీడీపీని అభిమానించేవారు బీజేపీకి ఓట్లు వేయొచ్చనేదే మోదీ వ్యూహం. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనే ప్లాన్ తో ఉన్న బీజేపీ అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలి పెట్టేలా లేదు. అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకూ చీదరించుకున్న చంద్రబాబుని ఇప్పుడు దగ్గరకు తీయడం.

బాబుకి అంత సీన్ ఉందా..?

అయితే టీడీపీకి కానీ, చంద్రబాబుకి కానీ తెలంగాణలో అంత సీన్ ఉందా అనేది అనుమానమే. 2014లో ఓట్లు పడ్డాయి, సీట్లు వచ్చాయి కానీ, 2018 ఎన్నికల్లో సాక్షాత్తూ నందమూరి హరికృష్ణ కుమార్తె కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. టీడీపీకి అంత ఓటు బ్యాంకే ఉంటే 2018లో ఆ ప్రభావం కచ్చితంగా కనపడేది. కానీ టీడీపీ కంచుకోటలు అనుకున్న చోట్ల.. టీఆర్ఎస్ పాగా వేసింది. 2023 నాటికి పరిస్థితిలో మార్పు వస్తుందని ఊహించలేం. కానీ సామాజిక వర్గాలు, సెటిలర్ల ఓట్లను బేరీజు వేసుకుని మోదీ, చంద్రబాబుని దువ్వుతున్నారు. అందుకే తెలంగాణలో ఎన్నికల ఏడాది నాటికి బాబుపై ఆయనకున్న కోపం తగ్గించుకున్నారు. ఇన్నాళ్లూ బాబుని పురుగుని చూసినట్టు చూసిన మోదీ, ఇప్పుడు దగ్గరకు తీశారంటే కచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంక్ ని ఉపయోగించుకోవాలనుకునే వ్యూహం కాక మరొకటి కాదు.

First Published:  7 Aug 2022 3:28 AM GMT
Next Story