Telugu Global
National

ఆగస్టు 23 ఇక 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'.. ప్రకటించిన ప్రధాని మోడీ

చంద్రయాన్-3కి సంబంధించి మూడు లక్ష్యాలను పెట్టుకోగా.. అందులో రెండు లక్ష్యాలు నెరవేరినట్లు ఇస్రో తెలిపింది.

ఆగస్టు 23 ఇక జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ప్రకటించిన ప్రధాని మోడీ
X

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన ఆగస్టు 23ను ఇకపై 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ ఉపరితలంపై ల్యాండర్ అడుగు పెట్టిన క్షణాలు ఈ శతాబ్దపు అత్యంత స్పూర్తిదాయక క్షణాల్లో ఒకటని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని శనివారం సందర్శించిన ప్రధాని మోడీ.. అక్కడ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..

ప్రపంచంలో మన దేశం అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ అయినా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒకటో స్థానంలో ఉందని చెప్పారు. ఇండియా.. తొలి మూడు ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలతో పోటీ పడేందుకు ఇస్రో సహకారం కూడా ఎంతో ఉందని అన్నారు. శాస్త్ర సాంకేతిక అధ్యయనాలు ప్రజల సులభతర జీవనానికి ఉపయోగపడాలని మోడీ ఆకాంక్షించారు. ఇప్పటికే దూర వైద్యం, విద్య, నావిక్, సమాచార సాంకేతికత, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, ఈ-గవర్నెన్స్‌లో అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు.

భవిష్యత్‌లో భారత అంతరిక్ష పరిశ్రమ రూ.1,600 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని మోడీ అంచనా వేశారు. చంద్రయాన్ అడుగు పెట్టిన పాయింట్‌ను శివశక్తిగా.. చంద్రయాన్-2 కూలిన ప్రాంతాన్ని తిరంగాగా పిలువనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. చంద్రయాన్-3 నమానా, ల్యాండర్, రోవర్ పనితీరుల గురించి ప్రధానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్‌నాథ్ వివరించారు.

మూడింట రెడు లక్ష్యాలు నెరవేరాయి : ఇస్రో

చంద్రయాన్-3కి సంబంధించి మూడు లక్ష్యాలను పెట్టుకోగా.. అందులో రెండు లక్ష్యాలు నెరవేరినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడమే తమ తొలి లక్ష్యమని, చంద్రుడి ఉపరితలంపై రోవర్ సురక్షితంగా దిగి.. అక్కడి నేలపై తిరగడం రెండో లక్ష్యమని చెప్పింది. ఇప్పటికే రెండు లక్ష్యాలను పూర్తి చేశామని పేర్కొన్నది. ఇక మూడో లక్ష్యం చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని, ప్రకంపనలను, కెమికల్ కాంపోజిషన్‌ను శాస్త్రీయంగా విశ్లేషించడమే మిగిలిందని చెప్పారు. మూడో లక్ష్యం దిశగా ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం సాగుతోందని ఇస్రో పేర్కొన్నది.


First Published:  27 Aug 2023 1:21 AM GMT
Next Story