13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి.. ఏపీకి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేశారు. చారిత్రాత్మక ఆయోధ్య రామ జన్మభూమి కేసులో ఆయన తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీకి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న బిశ్వ భూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఏపీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్. అబ్దుల్ నజీర్‌ను నియమించారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. చారిత్రాత్మక ఆయోధ్య రామ జన్మభూమి కేసులో ఆయన తీర్పు ఇచ్చారు. 1958 జనవరి 5న జన్మించిన జస్టిస్ నజీర్.. 1983 ఫిబ్రవరి 18న అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ చేసుకున్నారు. ఆయన కర్నాటక హైకోర్టులో చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేశారు. 2003 మే 12న ఆయన హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. 2019 వరకు కూడా ఆయనకు పాస్‌పోర్ట్ లేదని, చాలా సింపుల్ జీవితం గడిపారని ఆయన రిటైర్మెంట్ సభలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. తాజాగా కేంద్ర సిఫార్సు మేరకు రాష్ట్రపతి జస్టిస్ నజీర్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమించారు.
కొత్త గవర్నర్లు వీళ్లే..
1. ఆంధ్రప్రదేశ్ - జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
2. మహారాష్ట్ర - రమేశ్ బయాస్ (జార్ఖండ్ నుంచి బదిలీ)
3. లద్దాఖ్ (లెఫ్టినెంట్ గవర్నర్) - బీడీ. మిశ్రా (అరుణాచల్ ప్రదేశ్ నుంచి బదిలీ)
4. అరుణాచల్ ప్రదేశ్ - లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
5. చత్తీస్‌గఢ్ - బిశ్వ భూషణ్ హరిచందన్ (ఏపీ నుంచి బదిలీ)
6. మణిపూర్ - అనుసూయ ఊకే (చత్తీస్‌గఢ్ నుంచి బదిలీ)
7. నాగాలాండ్ - గణేషణ్ (మణిపూర్ నుంచి బదిలీ)
8. మేఘాలయ - ఫాగు చౌహాన్ (బీహర్ నుంచి బదిలీ)
9. బీహార్ - రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (హిమాచల్‌ప్రదేశ్ నుంచి బదిలీ)
10. సిక్కిం - లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
11. జార్ఖండ్ - సీపీ. రాధాకృష్ణన్
12. హిమాచల్‌ప్రదేశ్ - శివ్ ప్రతాప్ శుక్లా
13.అస్సాం - గులాబ్ చంద్ కటారియా