Telugu Global
National

10 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. రాష్ట్రపతి ఉత్తర్వులు

సిక్కిం గవర్నర్‌గా రాజస్థాన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను నియమించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా బదిలీ చేసింది.

10 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. రాష్ట్రపతి ఉత్తర్వులు
X

పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేయగా, ఏడుగురిని కొత్తగా నియమించారు. నియమితులైన గవర్నర్ల వివరాలిలా ఉన్నాయి.

తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66) నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడి గానూ ఆయన సేవలందించారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్‌గా నియమితులు కావడం విశేషం.

తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాడ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ఇక జార్ఖండ్‌ గవర్నర్‌గా యూపీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ను నియమించింది. మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డేని రాజస్థాన్‌ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించింది. ఇక సిక్కిం గవర్నర్‌గా రాజస్థాన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను నియమించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా బదిలీ చేసింది. ఆయనకు మణిపుర్‌ గవర్నర్‌ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపుర్‌ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.

ఛతీస్‌గఢ్‌ గవర్నర్‌గా అస్సాం మాజీ ఎంపీ రమెన్‌ డేకాను నియమించింది. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పదవీ కాలం పూర్తయింది. మేఘాలయ గవర్నర్‌గా కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్‌ విజయశంకర్‌ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్‌ను కేంద్రం తప్పించింది. ఇక అస్సాం గవర్నర్‌ గులాబ్‌చంద్‌ కటారియాను పంజాబ్‌ గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కె.కైలాసనాథన్‌ నియమితులయ్యారు. గుజరాత్‌ సీఎంగా మోడీ పనిచేసినప్పుడు ఆయన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకూ ఆయన ప్రధాన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మొత్తం 11 సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. 2024 జూన్‌ 30న ఆ పదవీకాలం పూర్తి కావడంతో ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించింది.

First Published:  28 July 2024 9:28 AM IST
Next Story