రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానం
అద్వానీ మినహా మిగిలిన నలుగురికి మరణాంతరం అవార్డు లభించింది. ఆ నలుగురి తరపున వారి కుటుంబ సభ్యులు ఇవాళ రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు అందుకున్నారు.
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అందజేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతరత్న పురస్కారానికి మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ ఎంపికైన వారిలో ఉన్నారు.
వీరిలో అద్వానీ మినహా మిగిలిన నలుగురికి మరణాంతరం అవార్డు లభించింది. ఆ నలుగురి తరపున వారి కుటుంబ సభ్యులు ఇవాళ రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు అందుకున్నారు. పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ మనవడు, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్, స్వామినాథన్ కుమార్తె నిత్యా రావు రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డులు అందుకున్నారు.
కాగా, ఈ అవార్డు స్వీకరించేందుకు అద్వానీ మాత్రం హాజరు కాలేదు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అద్వానీ అవార్డు స్వీకరించేందుకు రాలేకపోయారని సమాచారం. ఇదిలా ఉంటే ఈనెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు అవార్డు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.