Telugu Global
National

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.. చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్

నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తీసుకొచ్చిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.. చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్
X

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'నారీ శక్తి వందన్ అధినియమ్' పేరుతో తీసుకొని వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ శుక్రవారం ఉదయం దీనిపై సంతకం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితం ఈ బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో మహిళలకు ఇకపై 33 శాతం రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమమం అయ్యింది.

నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో తీసుకొచ్చిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విస్తృత చర్చ అనంతరం సదరు బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో అది చట్ట రూపం దాల్చింది. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటానికి నేటితో శుభం కార్డు పడింది.

కాగా, నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టంగా మారినా ఇప్పట్లో అమలు అయ్యే అవకాశాలు లేవు. ముందుగా జనగణన పూర్తి కావాల్సి ఉన్నది. ఆ తర్వాత తాజా సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధాని మోడీ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తెలియజేశారు.

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశానికి రాజీవ్ గాంధీ హయాంలోనే బీజం పడింది. పీవీ నర్సింహారావు హాయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఇక పార్లమెంట్, అసెంబ్లీల కోసం 1996లో హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలి సారిగి బిల్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ హాయాంలో కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టినా పాస్ కాలేదు. 2010లో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. కానీ లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును ఆమోదించింది.

First Published:  29 Sept 2023 6:12 PM IST
Next Story