Telugu Global
National

ఆరోజున అత్యధిక సిజేరియన్లు.. ఎందుకంటే..?

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగేది జనవరి-22న. అది అత్యంత బలమైన మహూర్తం అనే ప్రచారం ఉంది. ఆ రోజున తమకు బిడ్డ పుడితే వారి జీవితం కూడా ఆ శ్రీరాముడంత గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు.

ఆరోజున అత్యధిక సిజేరియన్లు.. ఎందుకంటే..?
X

సిజేరియన్ తప్పదని తేలినప్పుడు చాలామంది తల్లులు తమ బిడ్డలు జన్మించేది మంచి మహూర్తం కావాలనుకుంటారు. అందుకే మహూర్తం చూసి మరీ ఆపరేషన్ చేయించుకుంటారు. ఇలా మహూర్తం చూపించి ఆపరేషన్ చేయించుకోవడం రిస్క్ అనే వాదన కూడా ఉంది. కానీ మన దగ్గర జరిగే సిజేరియన్లన్నీ దాదాపుగా ఇలాగే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు వీటికి పరాకాష్టగా మారుతోంది జనవరి-22. ఆ రోజు అతి గొప్ప మహూర్తం ఉందని, అందుకే ఆరోజే తమకు ఆపరేషన్ చేయాలని చాలామంది గర్భిణులు వైద్యులను కోరుతున్నారట. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

జనవరి-22 ఎందుకు..?

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగేది జనవరి-22న. అది అత్యంత బలమైన మహూర్తం అనే ప్రచారం ఉంది. ఆ రోజున తమకు బిడ్డ పుడితే వారి జీవితం కూడా ఆ శ్రీరాముడంత గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకే హిందూ మతానికి చెందిన గర్భిణులు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారట. కేవలం ఉత్తర్ ప్రదేశ్‌ కి చెందిన గర్భిణులే కాదు.. ఇతర ప్రాంతాలవారు కూడా ఇదే మహూర్తాన్ని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆరోజు సిజేరియన్ జరిగేలా వైద్యులను అభ్యర్థిస్తున్నారట.

అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. జనవరి 22కు అటు ఇటుగా డెలివరీ డేట్ ఉన్న కొంతమంది విషయంలోనే ఈ మహూర్తం సక్సెస్ అవుతుంది. పనిగట్టుకుని అదే రోజు ప్రసవం అంటే అది తల్లి, బిడ్డలకు మంచిది కాదు అని కొంతమంది వైద్యులు నచ్చజెబుతున్నారట. పట్టుబట్టిన వారికి మాత్రం జనవరి-22 ఆపరేషన్ టైమ్ ఫిక్స్ చేస్తున్నారట. అంతే కాదు, ఆరోజు పుట్టబోయే బిడ్డలకు రాముడి పేరు కలసి వచ్చేలా నామకరణం చేసేందుకు కూడా తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  6 Jan 2024 9:00 PM IST
Next Story