Telugu Global
National

పెళ్లిపీటలెక్కాలంటే అమ్మాయికి ఆ పరీక్ష తప్పనిసరి..

వైద్య పరీక్షల్లో భాగంగా గర్భనిర్థారణ పరీక్షలు కూడా చేయడం వివాదానికి దారి తీసింది. పేదింటి అమ్మాయిలను కించపరిచేందుకే ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం చేపట్టిందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

పెళ్లిపీటలెక్కాలంటే అమ్మాయికి ఆ పరీక్ష తప్పనిసరి..
X

ప్రభుత్వ సాయంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నిరుపేద ఆడపిల్లలు వారు. ‘ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుకోడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారి వద్ద వివరాలు తీసుకోవడంతోపాటు వారికి కొన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడి వరకు బాగానే ఉంది, వైద్య పరీక్షల్లో భాగంగా గర్భనిర్థారణ పరీక్షలు కూడా చేయడం వివాదానికి దారి తీసింది. పేదింటి అమ్మాయిలను కించపరిచేందుకే ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం చేపట్టిందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. గర్భనిర్థారణ పరీక్షలతో మధ్యప్రదేశ్ లో తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది బీజేపీ ప్రభుత్వం.

మధ్యప్రదేశ్ లో ‘ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన’ పథకం అమలులో ఉంది. నిరుపేద యువతులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తారు. పెళ్లి సమయంలో ప్రభుత్వం నుంచి రూ.56వేలు ఆర్థిక సాయం అందిస్తారు. దీనికోసం ఇటీవల దిండోరి జిల్లా గడసరాయ్‌ ప్రాంతానికి చెందిన 219 యువతులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ యువతులందర్నీ వైద్య కేంద్రానికి రమ్మన్నారు అధికారులు. సాధారణ వైద్య పరీక్షలు చేస్తారని అనుకున్నారంతా. అక్కడికి వెళ్లాక వారు గర్భ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్‌ వికాస్‌ మిశ్రా వివరణ ఇచ్చారు. సామూహిక వివాహాలు చేసుకునే వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారని, కొంతమంది యువతులు తమకు నెలసరి సమస్యలున్నట్టు వైద్యుల వద్ద ప్రస్తావించారని, వారికి మాత్రమే గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారని చెప్పారు. ఆ పరీక్షల్లో నలుగురు యువతులు గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందని, వారిని సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొనవద్దని సూచించామని కలెక్టర్ వికాస్‌ వెల్లడించారు.

కాంగ్రెస్ విమర్శలు..

ఇలా గర్భ నిర్థారణ పరీక్షలు జరిపి ఆ యువతుల పరువు బజారునపడేలా చేశారని, ఒకవేళ విషయం తెలిసినా వారికి రహస్యంగా చెప్పి పంపించేయాలని కానీ, ఇలా బయటపెట్టడం దేనికని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. అసలీ ఘటన నిజమో, కాదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ పరీక్షలు చేశారా అని నిలదీశారు. మధ్యప్రదేశ్‌ ఆడబిడ్డలను బీజేపీ ప్రభుత్వం అవమానించిందని విమర్శించారు. మహిళలతో బీజేపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

First Published:  24 April 2023 1:19 AM GMT
Next Story