భక్తజనసంద్రమైన ప్రయాగ్ రాజ్
వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించడానికి భారీగా తరలివస్తున్న భక్తులు
వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్ రాజ్ భక్తజనసంద్రమైంది. అమృత స్నానాలు ఆచరించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. తమకు కేటాయించిన ఘాట్‌లలో అఖాడా సాధువులు త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. ఘాట్‌లన్నీ హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు సుమారు 62 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మౌనీ అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.వసంత పంచమి సందర్భంగా సుమారు 6 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మూడంచెల భద్రత మధ్య భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. ఒకే వరుసలో పంపేలా ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోనికి వచ్చేందుకు కార్లకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 5 వరకు ప్రయాగ, వారణాసిలో గంగాహారతి రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలున్నాయి.