Telugu Global
National

డీకోడర్‌.. డిజిటల్‌ మీడియాలోకి ప్రణయ్‌రాయ్‌

డీకోడర్‌.కామ్‌ పేరుతో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా నడిచే వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ అందుబాటులోకి రానుంది.

డీకోడర్‌.. డిజిటల్‌ మీడియాలోకి ప్రణయ్‌రాయ్‌
X

మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు ప్రణయ్‌ రాయ్‌. NDTV వ్యవస్థాపకుడిగా ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రణయ్‌.. డిజిటల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. డీ-కోడర్‌.కామ్- deKoder.com అనే కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రణయ్‌ రాయ్‌. దశలవారీగా ఈ ప్రాజెక్టును లాంచ్ చేస్తామని ప్రకటించారు. దాదాపు 15 భాషల్లో ఇది అందుబాటులోకి తేనున్నారని సమాచారం.

డీకోడర్‌.కామ్‌ పేరుతో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా నడిచే వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఎన్నికలు, వరల్డ్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారంతో పాటు.. ప్రణయ్‌ రాయ్ పాపులర్‌ ప్రొగ్రామ్‌ ది వరల్డ్‌ దిస్‌ వీక్‌ కూడా ఇందులో అందుబాటులో ఉండనుంది. AI ఆధారంగా ప్రేక్షకులే స్వయంగా సమాచారాన్ని విశ్లేషించుకునేలా ఈ యాప్‌, వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని ప్రణయ్‌ రాయ్ చెప్పారు.

సోమవారం తన ఫస్ట్‌ షోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు ప్రణయ్‌ రాయ్‌. ఇందులో ప్రముఖ రచయిత, ఇన్వెస్టర్‌ రుచిర్‌ శర్మతో ఎన్నికలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం లాంటి వివిధ అంశాలపై చర్చించారు. దాదాపు పది అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజు వ్యవధిలోనే యూట్యూబ్‌లో దాదాపు 9 వేల మంది డీకోడర్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

NDTVలో అదానీ గ్రూప్‌ మెజార్టీ వాటాను దక్కించుకోవడంతో 2022 నవంబర్‌ 30న ప్రణయ్‌ రాయ్‌తో పాటు ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న రాధికా రాయ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తర్వాత టాప్‌ మేనేజ్‌మెంట్‌ కూడా క్రమంగా సంస్థకు రిజైన్ చేశారు. వీరిలో కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్ సుపర్ణ సింగ్‌, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్‌ అరిజిత్ ఛటర్జీ, చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కవల్జిత్ బేడీతో పాటు టాప్ యాంకర్లు రవీష్‌ కుమార్‌, శ్రీనివాసన్ జైన్, నిధి రజ్దాన్‌ వరుసగా సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఇక రవీష్‌ కుమార్ సైతం సొంతంగా తన పేరుతో రవీష్‌కుమార్‌ అఫిషియల్‌ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. ఆ ఛానెల్‌కు ఇప్పటికే 80 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

First Published:  16 Jan 2024 3:47 AM GMT
Next Story