నాతో కలసి నటించాలంటే వారికి భయం - ప్రకాష్ రాజ్
తాను చేసే వ్యాఖ్యలు తన సినిమా కెరీర్ ని ప్రభావితం చేస్తున్నాయని అన్నారు ప్రకాష్ రాజ్. కొంతమంది నటీనటులు తనతో కలసి నటించడానికి భయపడుతున్నారని చెప్పారు.
రాజకీయ వ్యాఖ్యలతో ఇటీవల కలకలం రేపుతున్న ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో కలసి నటించేందుకు కొంతమంది వెనకాడుతున్నారని అన్నారు. ఇటీవల తాను రాజకీయాల పట్ల చూపిస్తున్న ఆసక్తే ఇందుకు కారణమని చెప్పారు. ఆ ఆసక్తితో తాను చేసే వ్యాఖ్యలు తన సినిమా కెరీర్ ని కూడా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. కొంతమంది నటీనటులు తనతో కలసి నటించడానికి భయపడుతున్నారని చెప్పారు.
సినీరంగంలో నటీనటులు చాలామంది నొప్పింపక తొనొవ్వక అన్నట్టుగా ఉంటారు. రాజకీయాలను పట్టించుకుంటే సినీరంగంలో తమకి ఎదురుదెబ్బలు తగులుతాయనే భయం చాలామందిలో కనిపిస్తుంటుంది. అధికారంలో ఉన్న పార్టీలకు అందుకే వారు దగ్గరగా ఉంటారు, అంతేకాని ఇతర పార్టీలు, నేతలపై విమర్శలు చేయరు. కానీ ప్రకాష్ రాజ్ అలా కాదు, నిజం నిర్భయంగా మాట్లాడే రకం. నేరుగా ప్రధాని నరేంద్రమోదీపైనే ఆయన ఆరోపణలు ఎక్కుపెడుతుంటారు. ఆ కారణంగా ఆయన అనేక అవార్డులు, రివార్డులు కూడా పోగొట్టుకున్నారనేది నిర్వివాదాంశం. కానీ తనకు ఇలాంటి జీవితమే కావాలంటారు ప్రకాష రాజ్. ఎవరినో పొగిడి, ఎవరి మెప్పుతోనో పదవులు సాధించాలనే ఉద్దేశం తనకు లేదని చెబుతారు. ఈ దశలో తన రాజకీయ కామెంట్ల వల్ల చాలామంది తనకు దూరమవుతున్నారని, కనీసం తనతో కలసి నటించేందుకు భయపడుతున్నారని అన్నారు ప్రకాష్ రాజ్.
ప్రకాష్ రాజ్ ని ఎంకరేజ్ చేస్తే ఆయన వ్యతిరేక శక్తులన్నీ తమకు కూడా వ్యతిరేకంగా మారతాయనేది కొంతమంది నటీనటుల అభిప్రాయం. అందుకే గతంలో లాగా పెద్ద హీరోల సినిమాల్లో ఆయన పాత్రల స్కోప్ తగ్గింది. ఆల్టర్నేట్ వెదుక్కుంటున్నారు. కానీ ప్రకాష్ రాజ్ తనకు ఇవేవీ పట్టవంటున్నారు. ఇలాంటప్పుడు తాను భయపడితే.. అది తన వైరి వర్గానికి శక్తిగా మారుతుందని అంటున్నారు ప్రకాష్ రాజ్. ఆ అవకాశం వారికి తాను ఇవ్వదలచుకోలేదని చెప్పారు. గతంలోకంటే ఇప్పుడే తాను మరింత స్వేచ్ఛగా జీవిస్తున్నానని, తన స్వరాన్ని వినిపించని రోజు నటుడిగా తాను చనిపోయినట్టేనని అన్నారు. చాలామంది నటులు మౌనంగానే ఉంటున్నారని, అలాగని వారిని తాను నిందించబోవడం లేదని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట్లాడినా, దాని వల్ల వచ్చే పరిణామాల్ని తట్టుకోలేరన్నారు.