పోస్టల్ బ్యాలెట్ల కొత్త విధానం.. ఈ ఎన్నికలనుంచే అమలు
ఎన్నికల సిబ్బందికి ఇచ్చే పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఇటీవల నిబంధనల్ని మార్చింది. కొత్తగా సెక్షన్ 18(ఏ)ని చేర్చింది.
పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా తీసుకొచ్చిన కొత్త నిబంధన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనుంచే మొదలు కాబోతోంది. ఈ నిబంధన ప్రకారం ఇకపై పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాల సమీపంలోని ప్రత్యేక కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో లాగా ఎక్కువరోజులు తమ వద్ద ఉంచుకోడానికి అవకాశం ఉండదు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో బేరసారాలకు అవకాశం లేకుండా చేసేందుకే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. వీటిని సంబంధిత కేంద్రాలకు చేర్చేందుకు సమయం ఉంటుంది. ఆలోగా బేరసారాలు మొదలవుతాయి. ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగితే పోస్టల్ బ్యాలెట్లతో జాతకాలు మారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. సాధారణ ఓటుకంటే వీటి రేటు ఎక్కువ. ఓటరుకి డబ్బులిస్తే పోలింగ్ బూత్ లోకి వెళ్లి తాము చెప్పిన గుర్తుపై ఓటు వేస్తారా లేదా అనేది అనుమానమే. పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే ఆ ఓటు తామే వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఎన్నికల సిబ్బంది దగ్గర పోస్టల్ బ్యాలెట్లకు రేటు కట్టి కొనుగోలు చేస్తుంటారు అభ్యర్థులు. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ఎన్నికల సిబ్బందికి ఇచ్చే తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఇటీవల నిబంధనల్ని మార్చింది. కొత్తగా సెక్షన్ 18(ఏ)ని చేర్చింది. పోస్టల్ బ్యాలెట్ అందుకున్నవారు దానిపై ఓటు వేసి, తమకు కేటాయించిన కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణ సమయంలోనే బ్యాలెట్ ను ఇస్తారు. తమకు నిర్దేశించిన కేంద్రానికి బయల్దేరే ముందే వారు దానిద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో బేరసారాలు సహేతుకం కాదని ఈసీ పేర్కొంది.