రైల్వే ప్లాట్ ఫారమ్ టీవీ స్క్రీన్లలో పోర్న్ వీడియోలు.. ప్రయాణికులు ఫైర్
జరిగిన ఘటనపై రైల్వే శాఖ సీరియస్ అయ్యింది. టీవీల్లో ప్రకటనల బాధ్యతలు చూసే దత్త కమ్యూనికేషన్ పై చర్యలు చేపట్టింది. ఆ ఏజెన్సీ పై కేసు కూడా నమోదు చేశారు.
అది బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్. వచ్చి పోయే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. కొంతమంది ప్రయాణికులు తాము ప్రయాణించాల్సిన రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ప్లాట్ ఫారమ్ లోని టీవీ స్క్రీన్లలో పోర్న్ వీడియోలు ప్రసారం కావడం మొదలైంది. ప్లాట్ ఫారమ్ లో ప్రకటనలకు బదులుగా అసభ్యకర వీడియోలు ప్రసారం కావడంతో ప్రయాణికులు బిత్తర పోయారు. స్టేషన్లోని టీవీల్లో ఇటువంటి వీడియోలు ప్రసారం కావడం ఏంటీ..? అని షాక్ అయ్యారు.
వెంటనే వారు విషయాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది పాట్నా రైల్వేస్టేషన్ లో టీవీల్లో ప్రకటనల బాధ్యతలు చూసే దత్త కమ్యూనికేషన్ వారితో మాట్లాడారు. పోర్న్ వీడియోలు ప్రసారం కాకుండా నిలిపివేశారు. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫారమ్ 10లో మూడు నిమిషాలకు పైగా పోర్న్ వీడియోలు ప్రసారం అయ్యాయి.
జరిగిన ఘటనపై రైల్వే శాఖ సీరియస్ అయ్యింది. టీవీల్లో ప్రకటనల బాధ్యతలు చూసే దత్త కమ్యూనికేషన్ పై చర్యలు చేపట్టింది. ఆ ఏజెన్సీ పై కేసు కూడా నమోదు చేశారు. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో చేర్చి జరిమానా కూడా విధించారు రైల్వే అధికారులు. ప్రకటనల కాంట్రాక్టు కూడా రద్దు చేశారు.
రైల్వే స్టేషన్‌లోని టీవీల్లో అసభ్యకర వీడియోలు ఎందుకు ప్రసారమయ్యాయో కనుగొనేందుకు రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉండగా రైల్వే ప్లాట్ ఫారమ్ లోని టీవీల్లో పోర్న్ వీడియోలు ప్రసారం అవుతున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. టీవీల్లో ప్రకటనలకు బదులుగా పోర్న్ వీడియోలు ప్లే చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.