సరుకులే కాదు, నగదు కూడా.. ఇది సంక్రాంతి భారీ కానుక
పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డ్ ఉన్నవారందరికీ కేజీ చక్కెర, కేజీ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం స్టాలిన్. సరకులతోపాటు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు కూడా ఇస్తామన్నారు.
ఎన్నికలు తరుముకొస్తుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొత్త కొత్త పథకాలను తెరపైకి తెస్తుంది. అడిగినా, అడక్కపోయినా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తుంది. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఇప్పుడప్పుడే లేకపోయినా ప్రజాకర్షక పథకాలతో దూసుకుపోతోంది. తాజాగా అక్కడ రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక ప్రకటించారు సీఎం స్టాలిన్. గతంలో కేవలం సరకులు మాత్రమ ఇచ్చేవారు. ఇప్పుడు నగదు కూడా అందులో చేర్చారు. వెయ్యి రూపాయల నగదు కూడా సంక్రాంతికి లబ్ధిదారుల చేతిలో పెట్టబోతున్నారు స్టాలిన్.
ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి కానుక అంటే కేజీ బియ్యం, అరకేజీ చక్కెరతో సరిపెడతారు, కానీ స్టాలిన్ మాత్రం సరకులతోపాటు నగదు కూడా ఇస్తున్నారు. అసలైన పండగ ఇదేనంటున్నారు. పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డ్ ఉన్నవారందరికీ కేజీ చక్కెర, కేజీ బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం స్టాలిన్. సరకులతోపాటు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదు కూడా ఇస్తామన్నారు. రేషన్ కార్డ్ ఉన్నవారంతా ఈ పథకానికి అర్హులను ప్రకటించారు.
తమిళనాడులోని 2.19 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్నాయి. దీనికోసం 2,356.67 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జనవరి 2నుంచి ఈ పథకం మొదలవుతుంది. సంక్రాంతి వరకు పండగ సరకులు, నగదు పంపిణీ చేస్తారు. విశేషం ఏంటంటే.. శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివశిస్తున్నవారికి కూడా పండగ సరకులు అందజేయబోతోంది తమిళనాడు ప్రభుత్వం. వారికి కూడా కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నారు. కొవిడ్ భయాల నేపథ్యంలో కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారమే పంపిణీ చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. పొంగల్ కిట్ల పంపిణీ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు.