Telugu Global
National

బీహార్ లో పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీష్ భేటీ

నితీష్ బీజేపీని వీడి బయటకు రావడం, ఆర్జేడీతో కలసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీహార్ లో రాజకీయ సమీకరణారు మారిపోయాయి. రెండేళ్లుగా నితీష్ కి దూరంగా ఉన్న పీకే ఇప్పుడు ఆయనతో భేటీ కావడం విశేషం.

బీహార్ లో పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీష్ భేటీ
X

బీహార్ రాజకీయాల్లో ఇది మరో ట్విస్ట్. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ ఒకచోటకు చేరారు. జేడీయూ మాజీ నేత పవన్‌ వర్మ వీరిద్దరి భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీ తర్వాత ఇరువురు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం, ప్రశాంత్ కిషోర్ తో తనకెలాంటి విభేదాలు లేవని నితీష్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్, పీకే చేతులు కలుపుతున్నారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా కలసి పనిచేయబోతున్నారని నిర్థారణ అవుతోంది.

జన సురాజ్ ఏమైనట్టు..?

దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవరించిన ప్రశాంత్ కిషోర్ జేడీయూలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత సీఎం నితీష్ తో విభేదించి బయటకొచ్చారు. జన సురాజ్ అంటూ బీహార్ లో పాదయాత్ర చేపడతానన్నారు. బీహార్ లో నితీష్ కి పోటీగా ఆయన ఎదుగుతారని అనుకున్నారంతా. కానీ అనుకోకుండా నితీష్ బీజేపీని వీడి బయటకు రావడం, ఆర్జేడీతో కలసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీహార్ లో రాజకీయ సమీకరణారు మారిపోయాయి. రెండేళ్లుగా నితీష్ కి దూరంగా ఉన్న పీకే ఇప్పుడు ఆయనతో భేటీ కావడం విశేషం. జేడీయూనుంచి బయటకెళ్లిపోయిన పవన్ వర్మ ఈ భేటీని ఏర్పాటు చేయడం మరింత విశేషం.

తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పిన సీఎం నితీష్ కుమార్, గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో తాను కలత చెందలేదని వివరణ ఇచ్చారు. తామిద్దరం చాలా కాలంగా ఒకరికొకరం తెలుసని, అందుకే కలుసుకున్నామని, కేవలం సాధారణ విషయాలే చర్చించామని, తామిద్దరం కలిస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టేనని అంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా పీకే, నితీష్ కలసి పనిచేయాలనుకుంటున్నారని, జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో కీలకంగా మారబోతున్న నితీష్ కి, పీకే సపోర్ట్ గా నిలుస్తారని అంటున్నారు. ఈ కీలక భేటీపై బీజేపీ నుంచి ఇంకా స్పందన రాకపోవడం విశేషం.

First Published:  15 Sept 2022 10:46 AM IST
Next Story