Telugu Global
National

ముంబైలో పొలిటికల్ హీట్.. ఇవాళ ఇండియా, రేపు ఎన్డీఏ కూటమి సమావేశాలు

మొత్తం 28పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకానున్నట్లు.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. రాజకీయ మార్పు కోసం బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపక్ష కూటమి అందిస్తుందని పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ముంబైలో పొలిటికల్ హీట్.. ఇవాళ ఇండియా, రేపు ఎన్డీఏ కూటమి సమావేశాలు
X

ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ఇవాళ ముంబైలో జరగనుంది. కూటమి సభ్యులు ఇవాళ, రేపు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మొదటి సమావేశం పట్నా, రెండో సమావేశం బెంగళూరులో విజయవింతంగా నిర్వహించిన విపక్షకూటమి అదే ఉత్సాహంతో ముంబైలో సమావేశాలకు రెడీ అయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతోపాటు ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాల పరిష్కారం, కూటమి లోగో ఆవిష్కరణ అజెండాతో ఈ భేటీ జరగనున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు. ఈ సమావేశాల్లోనే కూటమి కన్వీనర్‌గా మల్లిఖార్జున ఖర్గేను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 28పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకానున్నట్లు.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. రాజకీయ మార్పు కోసం బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపక్ష కూటమి అందిస్తుందని పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని తేల్చిచెప్పారు. ఎన్సీపీపై సందేహాలు వద్దని, పార్టీని వీడిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పవార్‌ జోస్యం చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎవరి పక్షమో తెలియదని తెలిపారు. ఇండియా కూటమిలో పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ఉమ్మడి అజెండా అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఇక కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బుధవారమే ముంబై చేరుకున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

మరోవైపు.. సెప్టెంబర్‌ 1నే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని అధికార ఎన్‌​డీఏ కూటమి రెండో సమావేశం ముంబైలో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతే లక్ష్యంగా ఎన్​డీఏ తొలి సమావేశం.. గతనెలలో ఢిల్లీలో జరిగింది. ఎన్​డీఏ సమావేశానికి ఈసారి ఎన్​సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ వర్గం కూడా హాజరుకానుంది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీతో కలిసి తాము ఈ భేటీకి హాజరవుతామని NCP ఎంపీ సునీల్ తత్కారే చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి మొదటి సమావేశానికి జనసేన హాజరైంది.

*

First Published:  31 Aug 2023 8:11 AM IST
Next Story