Telugu Global
National

తమిళనాడులో రాష్ట్ర, జాతీయ గీతాల రాజకీయ రచ్చ

కర్నాటక లోని శివమొగ్గలో బీజేపీ ఎన్నికల సభలో తమిళనాడు బీజేపీ అధ్య‌క్షుడు అన్నామలై పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

తమిళనాడులో రాష్ట్ర, జాతీయ గీతాల రాజకీయ రచ్చ
X

'తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా' అనే సామెతాలాగా నువ్వు రాష్ట్ర గీతాన్ని అవమానించావంటే లేదు నువ్వు జాతీయ గీతాన్ని అవమానించావంటూ తమిళనాడులోని రెండు రాజకీయ పక్షాల రచ్చ రసవత్తరంగా సాగుతోంది.

అసకు కథలోకి వెళ్తే....

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాల‌ నాయకులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో బీజేపీ ముందుంది. తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా ఇతర తెలంగాణ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటే తమిళనాడు బార్డర్ లో గల కర్నాటక ప్రాతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తో సహా పలువురు తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుత వివాదానికి కారణమైంది.

కర్నాటక లోని శివమొగ్గలో బీజేపీ ఎన్నికల సభలో తమిళనాడు బీజేపీ అధ్య‌క్షుడు అన్నామలై పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సభలో మొదట తమిళ‌ రాష్ట్ర గీతాన్నిప్లే చేశారు. అయితే మధ్యలోనే కర్నాటక బీజేపీ నాయకుడు ఈశ్వరప్ప ఆ గీతాన్ని ఆపేయించారు. కర్ణాటక రాష్ట్ర గీతాన్ని ప్లే చేయాలని ఆదేశించారు. ఇదంతా అన్నామలై సమక్షంలోనే జరిగింది.

దీని గురించి డీఎంకే ఎంపీ కనిమొళి, అన్నామలై పై విమర్శలు గుప్పించారు. తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానిస్తున్న బీజేపీ నేతలను నిలువరించలేని వ్యక్తి తమిళ ప్రజలను పట్టించుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అన్నామలై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు తమిళనాడు పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ సంఘటనతో తేటతెల్లమవుతోందని ఆమె ధ్వజమెత్తారు.

కనిమొళి విమర్శలతో డిఫెన్స్ లో పడ్డ బీజేపీ నేత అన్నామలై డీఎంకే నేతలకు సంబంధించిన తప్పులు ఏం దొరుకుతాయా అని పాత వార్తలను, వీడియోలను జల్లెడపట్టి విజయం సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుటి వీడియోను ఒకదాన్ని బైటికి లాగారు. ఒక కార్యక్రమంలో స్టాలిన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కానీ ఆ తర్వాత జాతీయ గీతాన్ని మాత్రం ప్లే చేయలేదు.

ఆ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేత అన్నామలై, జాతీయగీతం పాడలేని నాయకుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తమిళ రాష్ట్ర గీతం నుంచి కన్నడ, తెలుంగు, మలయాళముమ్, తుళువుమ్ పదాలు ఉన్న లైన్ ను తొలగించిన చరిత్ర డీఎంకేది కాదా? అని ప్రశ్నించారు. డీఎంకే చీప్ పాలిటిక్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు

ప్రస్తుతం ఈ ఇద్దరి నేతల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడుకు చెందిన నెటిజనులు కూడా రెండు గ్రూపులుగా మారి విమర్శలు గుప్పించుకుంటున్నారు.

First Published:  28 April 2023 11:16 AM IST
Next Story