డ్రోన్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా.. - రూ.30 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తొలుత ఈ డ్రోన్‌ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారు అనుమానంతో సరిహద్దు భద్రతా దళం సిబ్బందికి సమాచారం అందించారు.
డ్రోన్ ద్వారా అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఇలా డ్రోన్ ద్వారా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సరిహద్దు భద్రతా దళాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి.
తాజాగా మంగళవారం నాడు రాజస్థాన్‌లోని శ్రీగంగనగర్ జిల్లాలో మరో డ్రోన్ కలకలం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులోని కరణ్‌పూర్ సమీపంలో డ్రోన్ ద్వారా సరఫరా చేస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూ.30 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను పోలీసులు సీజ్ చేశారు.
తొలుత ఈ డ్రోన్‌ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారు అనుమానంతో సరిహద్దు భద్రతా దళం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ పారిస్ దేశ్‌ముఖ్ ఈ వివరాలను వెల్లడించారు.