బుల్డోజర్ ఇలా కూడా ఉపయోగపడుతుందా ?
ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు ఇళ్ళను కూల్చేందుకే ఉపయోగించిన బుల్డోజర్ ను మొదటి సారి పోలీసులు ఓ కాపురాన్ని నిలబెట్టడానికి వినియోగించారు. కోడలును ఇంట్లో నుంచి గెంటేసిన అత్తింటి వారిని బుల్డోజర్ తో భయపెట్టి కోడలును ఇంట్లోకి తీసుకెళ్ళె విధంగా చేశారు.
ఉత్తరప్రదేశ్ అంటే బుల్డోజర్ రాజ్యం అనే పేరు పడిపోయింది. తమకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ ఇళ్ళను ప్రభుత్వం బుల్డోజర్లతో కూలగొడుతుందనే ఆరోపణలున్నాయి. అక్కడ ఇప్పటికే అనేక ఇళ్ళను బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఓ సంఘటన కొంత ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. బుల్డోజర్లను ఇలా కూడా వాడొచ్చా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.
బిజ్నోర్ జిల్లా హల్దౌర్ పోలీసు స్టేషన్ పరిథిలోని హరినగర్ లో నూతన్ మాలిక్ అనే వివాహితను అత్తింటి వారు ఇంట్లో నుంచి గెంటేశారు. ఆమెకు 2017 లో పెళ్ళయ్యింది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను భర్తతో సహా అత్తింటి వారు వేధిస్తున్నారు.
2017లో పెళ్లయిన కొద్ది రోజులకే భర్త కుటుంబీకులు ఆమెను వేధించడం ప్రారంభించారని, 5 లక్షల రూపాయలు, బొలెరో కారు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆమె తండ్రి తెలిపారు. "వారి డిమాండ్లను తీర్చలేనందుకు ఆమెను కొట్టి, ఇంటి నుండి బయటకు పంపారు. ఆమె 2019 నుండి మా వద్దే ఉంటోంది.'' అని నూతన్ మాలిక్ తండ్రి చెప్పాడు.
''అప్పుడు మేము స్థానిక కోర్టును ఆశ్రయించాము, ఆమె తన అత్తమామల ఇంట్లో ఉండడానికి అనుమతించాలని కోర్టు ఆదేశించింది, " అని అతను చెప్పాడు. కానీ భర్త కుటుంబం కోర్టు ఆదేశాలను పాటించలేదు దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు కోర్టు ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. భర్త కుటుంబం ఆమెను తమ ఇంట్లో ఉండటానికి అనుమతించాలని కోర్టు తీర్పునిచ్చింది.
అయినా నూతన్ మాలిక్ భర్త కుటుంబం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో కోర్టు ఆదేశాలను అమలుపర్చడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మాలిక్ ను తీసుకొని ఆమె భర్త ఇంటికి పోలీసులు వెళ్ళగా వాళ్ళు తలుపు తీయడానికి నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలను వారికి వివరించినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలు పాటించక పోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు మైకులో హెచ్చరించినప్పటికీ వాళ్ళు వినలేదు.
ఇక ఇలా లాభం లేదని సమస్య పరిష్కారానికి పోలీసులు బుల్డోజర్ ను తీసుకొని వచ్చారు. తలుపులు తీసి నూతన్ మాలిక్ ను ఇంట్లోకి తీసుకెళ్ళకపోతే బుల్డోజర్ తో ఇంటిని కూల్చేస్తామని మైక్ లో హెచ్చరించారు. కిటికీ నుండి బుల్డోజర్ ను చూసిన నూతన్ భర్త కుటుంబం వెంటనే తలుపులు తీసి పోలీసులను బతిమిలాడుకుంది. కోడలును ఇంట్లోకి తీసుకెళ్ళారు.
అయితే ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు నూతన్ కు పోలీసు రక్షణ కల్పిస్తామని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు. ఆమెకు ఏ హాని తలపెట్టినా చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు.
Cops in UP's Bijnor district flanked by a bulldozer helped a woman gain entry to her in-laws house after she was refused access following a domestic absuse case which she won in the court. pic.twitter.com/AtEPtVfvdH
— Piyush Rai (@Benarasiyaa) August 29, 2022