Telugu Global
National

గుజరాత్ పాపానికి కాంట్రాక్ట్ సంస్థ బలి.. తప్పించుకున్న ప్రభుత్వం

బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనకు బాధ్యులంటూ 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేకపోవడం విశేషం. తప్పంతా ప్రభుత్వానిదైతే.. ఆ ప్రతాపం కాంట్రాక్ట్ సంస్థ, కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగులపై చూపించారు.

గుజరాత్ పాపానికి కాంట్రాక్ట్ సంస్థ బలి.. తప్పించుకున్న ప్రభుత్వం
X

గుజరాత్ లోని మోర్బీలో తీగల వంతెన కూలిపోయిన ఘటనలో తప్పంతా ప్రభుత్వానిదేననే విషయం తేలిపోయింది. మరమ్మతు పనులు కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించే విషయం దగ్గర్నుంచి, పెద్ద సంఖ్యలో ప్రజల్ని బ్రిడ్జి పైకి అనుమతివ్వడం, కనీసం బ్రిడ్జ్ నాణ్యత పరీక్షించకుండా పర్యాటకుల్ని అనుమతించడంతో ఈ ఘోరం జరిగింది. 141మంది ప్రాణాలు పోయాయి. అయితే ఎన్నికల వేళ పాప ప్రక్షాళణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనకు బాధ్యులంటూ 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేకపోవడం విశేషం. తప్పంతా ప్రభుత్వానిదైతే.. ఆ ప్రతాపం కాంట్రాక్ట్ సంస్థ, కాంట్రాక్ట్ ఉద్యోగులపై చూపించారు.

విపరీతమైన రద్దీ కారణంగా, ఆ బరువుకి కేబుల్ బ్రిడ్జ్ తెగిపోయిందని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ వర్గాల నివేదిక తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 9మందిని అరెస్ట్ చేశారు. వంతెన మరమ్మతుల కాంట్రాక్ట్ తీసుకున్న ఒరేవా సంస్థ నిర్వాహకులు కూడా అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. వంతెనపై వెళ్లేవారి వద్ద డబ్బులు వసూలు చేసేలా ఓ కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పని తీసుకున్నందుకు ఇప్పుడు ఆ సంస్థ నిర్వాహకులు కూడా దోషులుగా మారారు. కాంట్రాక్టర్లతో పాటు, వారు పెట్టిన టికెట్‌ కలెక్టర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తప్పెవరిది..? శిక్ష ఎవరికి..?

వంతెన కూలిపోయిన ఘటనలో తప్పంతా ప్రభుత్వానిది, ప్రభుత్వ అధికారులది అనే విషయం తేలిపోయింది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం కాంట్రాక్ట్ సంస్థలపై ప్రతాపం చూపించారు. నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేని ఎలక్ట్రిక్ పరికరాల సంస్థ ఒరేవాకు బ్రిడ్జ్ మరమ్మతు పనులను అప్పగించడమే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు తర్వాత బ్రిడ్జ్ నాణ్యత పరిశీలించకుండా పర్యాటకుల్ని అనుమతించడం రెండో తప్పు. టికెట్ రేటు పెట్టి, పెద్ద ఎత్తున జనాల్ని అక్కడకు తరలించడం మూడో తప్పు. ఇలా తప్పుమీద తప్పు చేసి 141 మందిని బలితీసుకున్న పాలకులు.. నష్టపరిహారంతో పాపం కడిగేసుకోవాలనుకుంటున్నారు. కన్నీరు కార్చి మోదీ సరికొత్త డ్రామాకు తెరతీశారు. ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థల నిర్వాహకుల్ని మాత్రమే అరెస్ట్ చేసి, కేసుని నీరుగార్చబోతున్నారు పోలీసులు.

First Published:  1 Nov 2022 9:53 AM IST
Next Story