బంగ్లాదేశ్ విముక్తి సత్యాగ్రహం సందర్భంలో మోడీ జైలుకు వెళ్ళారో లేదో PMOకు తెలియదట!
బంగ్లా దేశ విముక్తి కోసం జరిగిన సత్యా గ్రహంలో పాల్గొని తాను జైలుకెళ్ళానని నరేంద్ర మోడి చెప్పిన మాటల్లోని నిజాలు ప్రధానంత్రి కార్యాలయానికి తెలియదట. ఈ విషయంపై ఆర్టీఐ కింద ప్రశ్నించిన ఓ కార్యకర్తకు పీఎంవో ఎటువంటి నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.
బంగ్లా విముక్తి పోరాట సమయంలో తాను 20-22 యేళ్ళ యువకుడినని, తన సహచరులతో కలిసి బంగ్లా విముక్తి కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అప్పుడు తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్ళానని పేర్కొన్నారు.
ఈ విషయాలు నిజమేనా అనే సందేహాలకు ప్రధాని కార్యాలయం ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. దాంతో ఈ సందేహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
గత ఏడాది బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢాకా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లా విముక్తి, స్వాతంత్య్ర పోరాటంలో భారత్ కీలకంగా వ్యవహరించడమేగాక, ప్రత్యక్ష పాత్ర పోషించింది. ఆ పోరాట జ్ఞాపకార్ధంతో పాటు షేక్ ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్పవాల సందర్భంగా జరిగిన 'ముజీబ్ బోర్షో' ఉత్సవాలలో ప్రధానమంత్రి మోడీపాల్గొన్నారు.
26 మార్చి 2021 లో ఆయన ఢాకాలో గౌరవ వందనం స్వీకరించారు. ఆ సందర్భంలో మోడీ మాట్లాడుతూ.. బంగ్లా విముక్తి పోరాట సమయంలో తాను 20-22 యేళ్ళ యువకుడినని, తన సహచరులతో కలిసి బంగ్లా విముక్తి కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నానని , అప్పుడు తాను అరెస్టయి జైలుకు కూడా వెళ్ళానని పేర్కొన్నారు.
మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అనేక మంది మోడీ ప్రత్యర్థులు ఆయన మాటల్లోని వాస్తవికతను ప్రశ్నించారు. మోడీ విద్యార్హతలు, గతంలో టీ-అమ్మేవాడినన్న వ్యాఖ్యలు కూడా ప్రశ్నార్ధకమయ్యాయి. అలాగే, 2016 నోట్ల రద్దు విధానం, కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటం, పిఎం కేర్స్ ఫండ్, భారతదేశం వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్రతిస్పందనలకు సంబంధించి ఆయన తీసుకున్న వివిధ నిర్ణయాలు, వాదనలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
ఇదీ విషయం..
1971 ఆగస్టు 1-11 వరకు ఢిల్లీలో 'బంగ్లాదేశ్‌ను గుర్తించండి సత్యాగ్రహం' ఉద్యమాన్ని జన్ సంఘ్ చేపట్టింది. అయితే ఆ ఉద్యమం ఇండో-సోవియెట్ మధ్య జరిగిన స్నేహ ఒప్పందానికి నిరసన ర్యాలీగా ముగిసిందని 27 మార్చి 2021న ది వైర్ లో శుబ్రత సేన్‌గుప్తా రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇండో-సోవియట్ ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని మళ్ళించాలన్నదే జనసంఘ్ ప్రాథమిక లక్ష్యం. ఇది 'బంగ్లాదేశ్‌కు ద్రోహం' అని జన్ సంఘ్ నిరూపించాలనుకుంది.
ఆగస్ట్ 12, 1971న ఢిల్లీలో జరిగిన భారీ ర్యాలీలో వాజ్‌పేయి మాట్లాడుతూ, ఇండో-సోవియట్ ఒప్పందం 'బంగ్లాదేశ్‌కు గుర్తింపు నిరాకరించడానికి ఢిల్లీ -మాస్కోల మధ్య జరిగిన కుట్ర' అని పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో సేన్ గుప్తా రాశారు. "నరేంద్ర మోదీ పాల్గొన్నట్లు చెప్పుకుంటున్న 'సత్యాగ్రహం ఇదే. గతంలో బంగ్లాదేశ్ పర్యటనలో కూడా ఆయన దీని గురించి మాట్లాడారు" అని సేన్ గుప్తా రాశారు.
వివరాల కోసం ఆర్టీఐ దరఖాస్తు..
నరేంద్ర మోడీ చుట్టూ ఈ వివాదం జరుగుతున్న తరుణంలో జయేష్ గుర్నానీ అనే హక్కుల కార్యకర్త మార్చి 27, 2021న మోడీ జైలుకెళ్ళానన్న ప్రకటనలకు సంబంధించి వివరాలు కావాలని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. గుర్నాని ఐదు నిర్దిష్ట అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరారు. మోడీని అరెస్టు చేసిన ఆరోపణలను వివరించే పత్రాలకు సంబంధించి ధృవీకరణ కాపీలను అడిగారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, అతని అరెస్టుపై అరెస్ట్ మెమో లేదా ఏదైనా ఇతర సంబంధిత పత్రాలు, జైలు నుండి అతని విడుదలకు సంబంధించిన పత్రాలు, అతనిని ఉంచిన జైలు పేరు వివరాలు ఇవ్వాలని గుర్నాని ప్రధాని కార్యాలయాన్ని కోరారు.
అయితే , పిఎంఓ నిర్దిష్ట సమాచారం ఏదీ ఇవ్వలేదు. మోడీకి సంబంధించిన వివరాలు పిఎంవో వెబ్ సైట్ ల్ పిఎమ్స్ స్పీచెస్ అనే లింకు ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అయినా 2014 లో మోడీ ప్రధాని అయిన తర్వాతనుంచే రికార్డులు పదిల పరుస్తున్నామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని గుర్నాని పిఎంవోలోని ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ డైరెక్టరేట్ లో అప్పీల్ చేశారు. 4 జూన్ 2021న పిఎంఓ లోని ప్రధాన సమాచార అధికారి (సిపిఆర్ ఓ) ఆన్లైన్ లో జవాబిచ్చారు కాబట్టి దీనిపై తదుపరి చర్యలు ఏమీ లేవని తేల్చి చెప్పారు.
దీనిపై గుర్నాని సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయం ప్రధాన సమాచార కమిషనర్ వై.కె. సిన్హా కమిషన్ 2022 ఆగస్టు 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై విచారణ జరిపింది. కరోనా పాండమిక్ పరిస్థితులలో కార్యాలయాలు సక్రమంగా పనిచేయలేదని పిఎంఓ విచారణ సందర్భంగా తెలిపింది. సిఐసి సిన్హా స్పందిస్తూ.. సమాచారం కావాలనే ఇవ్వలేదా లేదా అసమంజస కారణాల రీత్యా ఇవ్వలేదా అనేది కమిషన్ తేల్చాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల కమిషన్ దానిని నిర్దారించలేదని పేర్కొంటూ ..కేసును మూసి వేశారు. ఇంతకీ మోడీ బంగ్లా విముక్తి పోరాటం సందర్భంగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారా లేదా..అరెస్టయి జైలుకెళ్ళారా లేదా అనే విషయమై ఎటువంటి నిర్దిష్ట సమాచారం లభించలేదు.