Telugu Global
National

మోదీతో పెట్టుకుంటే అంతే.. కేజ్రీవాల్ కి 25వేలు జరిమానా..

మోదీ సర్టిఫికెట్లను పీఎంవో లేదా యూనివర్శిటీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది గుజరాత్ హైకోర్ట్. ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌ కు రూ.25వేల జరిమానా విధించింది.

మోదీతో పెట్టుకుంటే అంతే.. కేజ్రీవాల్ కి 25వేలు జరిమానా..
X

మోదీ అనే పేరు ప్రతిపక్షాలకు ఎందుకో పెద్దగా కలసి రావడంలేదు. ఆ పేరు వ్యవహారంలోనే రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడింది. మోదీ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాలని అడిగినందుకు ఇప్పుడు కేజ్రీవాల్ కి 25వేల రూపాయల జరిమానా పడింది. 2016లో మోదీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలంటూ కేజ్రీవాల్, కేంద్ర సమాచార కమిషన్ కి పెట్టుకున్న దరఖాస్తు ఏడేళ్ల తర్వాత 25వేల రూపాయల జరిమానా రూపంలో రివర్స్ లో తగిలింది.

అసలు కథేంటి..?

ఎన్నికల్లో పోటీ సమయంలో పీజీ చేసినట్టుగా నామినేషన్లో తన విద్యార్హతను పేర్కొనేవారు మోదీ. 1978లో గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసినట్టు, 1983లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసినట్టు ఆయన చెప్పుకునేవారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేజ్రీవాల్ 2016లో కేంద్ర సమాచార కమిషన్ (CIC)కి అర్జీ పెట్టుకున్నారు. మోదీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిని పరిశీలించిన CIC.. మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌ లు కేజ్రీవాల్‌ కు పంపించాలంటూ గుజరాత్‌ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలతోపాటు పీఎంవో కార్యాలయ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ కి ఆదేశాలిచ్చింది. CIC ఆదేశాలను సవాల్‌ చేస్తూ గుజరాత్‌ యూనివర్సిటీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది.

అప్పట్లో CIC ఆదేశాలపై స్టే విధించిన గుజరాత్ హైకోర్ట్ ఇటీవల విచారణ కొనసాగించింది. మోదీ సర్టిఫికెట్లను పీఎంవో లేదా యూనివర్శిటీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌ కు రూ.25వేల జరిమానా విధించింది. జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్‌ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో జమ చేయాలని ఆదేశించింది. మోదీ విద్యార్హతలు కోరినందుకు చివరకు కేజ్రీవాల్ 25వేల జరిమానా కట్టాల్సి వస్తోంది.

First Published:  31 March 2023 6:24 PM IST
Next Story