అదానీ పేరెత్తకుండానే మోదీ ప్రసంగం.. రాజ్యసభలోనూ అదే తంతు
బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దాదాపు ఎనిమిదేళ్లు పాలించినా కూడా తప్పు ఇంకా కాంగ్రెస్ దేనంటూ మభ్యపెట్టడానికి ఏమాత్రం మొహమాటపడలేదు మోదీ.
అదానీ కుంభకోణంపై ప్రధాని స్పందించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నా కూడా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. అసలు అదానీ ఎవరో తెలియదన్నట్టుగానే తాను చెప్పాల్సింది చెప్పి ముగించేశారు. లోక్ సభలో జరిగిన తంతు రాజ్యసభలోనూ కొనసాగింది. విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నా కూడా మోదీ తీరు మారలేదు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీ వేయాలని, దర్యాప్తు జరిపించాలంటూ నినాదాలు చేశారు విపక్ష నేతలు. వారి నినాదాల మధ్యే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తప్పంతా కాంగ్రెస్ దే..
బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దాదాపు ఎనిమిదేళ్లు పాలించినా కూడా తప్పు ఇంకా కాంగ్రెస్ దేనంటూ మభ్యపెట్టడానికి ఏమాత్రం మొహమాటపడలేదు మోదీ. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదని, దేశ ప్రగతిని నాశనం చేసిందని, చిన్న చిన్న దేశాలు పురోగమనంలో పయనిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని భారత్ కోల్పోయిందని అన్నారు మోదీ.
తమ ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదజల్లినా ‘కమలం’ మరింతగా వికసిస్తుందని అన్నారు మోదీ. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదని చెప్పారు. “సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుంది. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మేం ఏమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నాం.” అని అన్నారు మోదీ.
బ్యాంకు ఖాతాలు కూడా గొప్పేనా..?
రాజ్యసభలో మోదీ ప్రసంగంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చివరకు జన్ ధన్ ఖాతాలు తెరిపించడాన్ని కూడా మోదీ తమ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారని విమర్శించారు విపక్ష నేతలు. యూపీయే ప్రవేశ పెట్టిన పథకాలను మోదీ కొనసాగించారే కానీ, కొత్తవి సృష్టించలేదని, నిరంతర అభివృద్ధికి ఆయన సాక్షి మాత్రమేనని, కర్త కాదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేతలు