Telugu Global
National

సోనియాపై మోదీ సెటైర్లు..

రాజస్థాన్ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడిన మోదీ.. సోనియా గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సోనియాపై మోదీ సెటైర్లు..
X

400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న ఎన్డీఏ కూటమి.. అధికారం నిలబెట్టుకుంటే చాలని అనుకుంటోంది. అదే సమయంలో ఇండియా కూటమిలోని లుకలుకలు బీజేపీకి బాగా కలిసొస్తాయని అనుకుంటున్నారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కి కనీసం ఇప్పుడు 300 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్రమోదీ. తప్పులు చేసి చేసి వారు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు. ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఒకటి ఏర్పాటు చేశారని విమర్శించారు. కూటమిలోని పార్టీలే 25 శాతం సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని సెటైర్లు పేల్చారు మోదీ.

రాజస్థాన్ లోని జలోర్‌లో లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్‌ 26న ఇక్కడ రెండో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజస్థాన్ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడిన మోదీ.. సోనియా గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని నేతలు కొందరు.. రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్‌ ని అడ్డాగా మార్చుకున్నారని అన్నారు మోదీ. గతంలో కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడు సోనియాగాంధీ కూడా రాజస్థాన్ ని ఇలా పరోక్ష రాజకీయాలకు వాడుకుంటున్నారని సెటైర్లు పేల్చారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉందన్నారు మోదీ. ఒకప్పుడు ఆ పార్టీ 400 స్థానాలు గెలుచుకుందని, ఇప్పుడు మాత్రం అభ్యర్థుల్నే నిలబెట్టలేకపోతోందని చెప్పారు. 400 మార్కుని ఈసారి ఎన్డీఏ అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై కూడా బీజేపీ ఫోకస్ పెంచింది. దక్షిణాది సపోర్ట్ తో 400 మార్కు దాటాలని చూస్తోంది. మరి ఆ అంచనాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

First Published:  21 April 2024 5:32 PM IST
Next Story