‘డీప్ ఫేక్’పై ప్రధాని స్పందన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసి ఇలా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని ప్రధాని తెలిపారు.
డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలతో ఇటీవల ఆకతాయిలు సెలబ్రిటీలు, సినీ తారలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవి రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. సినీ నటి రష్మికపై చేసిన డీప్ ఫేక్ వీడియో కలకలం సృష్టించిన ఘటన మరువకముందే.. బాలీవుడ్ నటి కాజోల్‌పై మరో ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు.
కొంతమంది ఆకతాయిలు చేస్తున్న ఈ చేష్టలు అనేక మందిని ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసి ఇలా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని ప్రధాని తెలిపారు.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయని చెప్పారు. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయని తెలిపారు. ఇటీవల తాను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలపై మీడియా, సోషల్ మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని మోదీ సూచించారు.