Telugu Global
National

నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ఆ ఏకశిల తెలంగాణదే

ఈ ఏకశిలా విగ్రహానికి అవసరమైన గ్రానైట్‌ను తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి తెప్పించారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ దీనిని రూపొందించారు.

నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ఆ ఏకశిల తెలంగాణదే
X

స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు నిర్మించిన సెంట్రల్ విస్టా అవెన్యూను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన నేతాజీ 28 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం శ్రద్ధాంజలి ఘటించారు. నేతాజీ సేవలు తరతరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర‌ప్రభుత్వం చెప్పింది.

కాగా, ఈ ఏకశిలా విగ్రహానికి అవసరమైన గ్రానైట్‌ను తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి తెప్పించారు. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ దీనిని రూపొందించారు. 65 మెట్రిక్ టన్నుల బరువైన ఈ శిల్పాన్ని చెక్కడానికి అరుణ్ యోగిరాజ్‌కు ఏపీ, తమిళనాడు, రాజస్థాన్‌కు చెందిన కళాకారులు కూడా సాయపడ్డారు. గతంలో కేదార్‌నాథ్‌లో 12 అడుగుల ఆది శంకరాచార్య శిల్పాన్ని యోగిరాజ్ చెక్కారు. ఆయన పనితనాన్ని గుర్తించి చంద్రబోస్ విగ్రహ పనులను అప్పగించారు.

వలసవాదం ఇక చరిత్రలో కలిసిపోనుంది : ప్రధాని మోడీ

నేతాజీ విగ్రహాన్ని, సెంట్రల్ విస్టా అవెన్యూను ఓపెన్ చేసిన తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు. రాజ్‌పథ్ అనేది బానిసత్వానికి ఓ చిహ్నంగా ఉందని.. అందుకే కర్తవ్యపథ్‌గా పేరు మార్చామని అన్నారు. ఇకపై వలసవాదం, దానికి సంబంధించిన చిహ్నాలు అన్నీ మాయమైపోతాయని.. అవి చరిత్రలో కలిసిపోతాయని ప్రధాని అన్నారు. కర్తవ్యపథ్ అనేది కేవలం రాళ్లు, ఇటుకలతో నిర్మించిన రహదారి మాత్రమే కాదని.. ప్రజలు ఇక్కడకు వచ్చినప్పుడు నేతాజీ విగ్రహాన్ని చూసి, దేశ‌ స్వాతంత్రం కోసం పోరాడిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటారని అన్నారు.

ఇది నయా భారత్‌కు సరికొత్త మలుపు, ఇండియాను అత్యంత గొప్ప దేశంగా మర్చాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. కర్తవ్యపథ్ మీద నుంచి మంత్రులు, అధికారులు వెళ్తున్న సమయంలో వారికి తమ కర్తవ్యం ఏంటో గుర్తుకు రావాలన్నారు. బానిసత్వం, వలసవాదం ఇకపై ఉండదని మోడీ చెప్పారు. సెంట్రల్ విస్టా కోసం కష్టపడిన ఉద్యోగులు, కార్మికులందరినీ రాబోయే రిపబ్లిక్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు మోడీ చెప్పారు.

First Published:  8 Sept 2022 3:51 PM GMT
Next Story