ముగిసిన జీ-20 సమావేశాలు.. నెక్ట్స్ అధ్యక్ష బాధ్యతలు ఆ దేశానికే..!
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్-UNOలో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు మోడీ. సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ..యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన 18వ జీ-20 సమావేశాలు ఆదివారం మధ్యాహ్నానికి ముగిశాయి. ముగింపు ప్రసంగంలో భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని మోడీ తర్వాతి జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వాకు అప్పగించారు. తర్వాత ఈ సదస్సులో తీర్మానాలను ప్రధాని మోడీ ప్రకటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌పై చేస్తోన్న కృషికి జీ-20 వేదికగా మారడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు మోడీ.
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్-UNOలో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు మోడీ. సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ..యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదన్నారు. 51 దేశాలతో UNO ఏర్పడిందన్న మోడీ.. అప్పటి పరిస్థితులు వేరని చెప్పారు. ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 200కు చేరిందని గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సి ఉందన్నారు.
ఇక ఫస్ట్ టైం జీ-20 సమావేశాలు ఇండియాలో జరిగాయి. దీంతో మోడీ సర్కార్ ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందుకోసం దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇక సమావేశాల మొదటి రోజునే మోడీ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భాగస్వామ్య దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇది భారత్ సాధించిన అపూర్వ విజయమని పార్టీలకతీతంగా నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.