నోబెల్ శాంతి బహుమతి రేసులో ముందున్న ప్రధాని నరేంద్ర మోడీ!
ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడంతో మోడీ జోక్యం చేసుకున్నారని.. రష్యా అణ్వాయుధాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది బహుమతి గెలుచుకోవడానికి బరిలో ఉన్న వారిలో భారత ప్రధాని నరేంద్ర మోడీనే బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఈ మేరకు నార్వేరియన్ నోబెల్ కమిటీ డిప్యుటీ లీడర్ ఆస్లే టోజే వెల్లడించారు. ప్రస్తుత ప్రపంచంలో శాంతి కోసం కృషి చేస్తున్న వారిలో నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారని ఆయన తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న నోబెల్ కమిటీ తమ అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ సారి నరేంద్ర మోడీకి శాంతి బహుమతి తప్పకుండా వస్తుందనే అంచనాలు పెరిగిపోయాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపడానికి ప్రధాని నరేంద్ర మోడీ చూపిన చొరవను సదరు కమిటీ ప్రశంసించింది. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడంతో మోడీ జోక్యం చేసుకున్నారని.. రష్యా అణ్వాయుధాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టోజే ఉటంకించారు. ఇది యుద్దానికి సరైన సమయం కాదని పుతిన్‌తో మోడీ నేరుగా చెప్పారని ఆయన అన్నారు.
ఇండియా నుంచి నోబెల్ శాంతి బహుమతి కోసం గతంలో కూడా అనేక నామినేషన్లు వచ్చిన విషయాన్ని ఆస్లే టోజే గుర్తు చేశారు. ఈ శాంతి బహుమతి కోసం ప్రపంచ నాయకులు తమకు అవసరమైనది చేస్తారని అన్నారు. మోడీ వంటి బలమైన నాయకుడికి శాంతి స్థాపనలో మంచి నైపుణ్యం ఉందని.. ఆయన శక్తివంతమైన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని టోజే అన్నారు. భారతీయులకు అపారమైన శక్తి మరియు విశ్వసనీయత ఉన్నది... భీకరమైన యుద్దాన్ని ముగించడానికి వారు ఈ విశ్వసనీయతను, శక్తిని ఉపయోగిస్తారని తాను ఆశిస్తున్నట్లు టోజే చెప్పారు.
కాగా, 2002 గోద్రా ఘటన, గుజరాత్ అల్లర్ల అనంతరం అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు అప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి వీసాను తిరస్కరించాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా అశాంతిని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీలో కూడా మోడీని దోషిగా తేల్చుతూ కథనం వెలువడింది. అయితే, గుజరాత్ అల్లర్లకు సంబంధించిన న్యాయపోరాటంలో మోడీ విజయం సాధించారు. తాజాగా ఆయన నోబెల్ శాంతి బహుమతి రేసులో ముందంజలో ఉన్నారని స్వయంగా నోబెల్ కమిటీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.