Telugu Global
National

కేరళ స్టోరీ సినిమాకి మోదీ ప్రచారం

బళ్లారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రధాని మోదీ.. 'ది కేరళ స్టోరీ' అద్భుతమైన సినిమా అన్నారు. ఇలాంటి సినిమాలను నిషేధించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, అలాంటి ప్రతిపక్షాలు ఉండటం దేశం చేసుకున్న దురదృష్టం అన్నారు.

కేరళ స్టోరీ సినిమాకి మోదీ ప్రచారం
X

అనేక వివాదాల మధ్య 'ది కేరళ స్టోరీ' సినిమా ఈరోజు విడుదలైంది. సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ వేసిన పిటిషన్ల విషయంలో.. హైకోర్టుల్లో తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచించడం, చివరకు హైకోర్టు కూడా సినిమా ప్రదర్శనపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో థియేటర్లలో 'ది కేరళ స్టోరీ' బొమ్మ పడింది. సినిమాకి స్పందన ఎలా ఉందనే విషయం పక్కనపెడితే కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ కూడా 'ది కేరళ స్టోరీ' సినిమాకి ఉచిత ప్రచారం చేస్తున్నారు.


బళ్లారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రధాని మోదీ.. 'ది కేరళ స్టోరీ' అద్భుతమైన సినిమా అన్నారు, దేశంలో జరుగుతున్న వాస్తవాలను ఆ సినిమా చూపించిందని చెప్పారు. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవైన కేరళలో, విద్యావంతులున్న రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో చూడండి అని అన్నారు. ఇలాంటి సినిమాలను నిషేధించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, అలాంటి ప్రతిపక్షాలు ఉండటం దేశం చేసుకున్న దురదృష్టం అన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు.

మరోవైపు 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, సెక్యులర్ కేరళ సమాజం ఈ సినిమాను అంగీకరిస్తుందని వ్యాఖ్యానించింది. ఇది చరిత్రకాదు, కల్పితం అని చెబుతున్నారు కదా అని పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ సినిమా సమాజంలో మతవివాదాన్ని, సంఘర్షణను ఎలా సృష్టిస్తుందని అడిగారు న్యాయమూర్తులు. సినిమా ప్రదర్శించినంత మాత్రన ఏమీ జరగదని, దేశ పౌరులకు నమ్మే హక్కు కల్పించబడిందని, దీంట్లో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు.

First Published:  5 May 2023 3:48 PM IST
Next Story