50వేల కోట్లు.. ఎన్నికలున్న రాష్ట్రాలకు కేంద్రం తాయిలాలు
జులై7, 8 తేదీల్లో ప్రధాని మోదీ 4 రాష్ట్రాల్లో పర్యటిస్తారు. 4 రాష్ట్రాల్లో 50 కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వాటి విలువ అక్షరాలా 50వేల కోట్ల రూపాయలు.
ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన
మొత్తం 4 రాష్ట్రాల్లో మోదీ టూర్
50 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన
ప్రాజెక్ట్ ల విలువ రూ.50 వేల కోట్లు
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎంతగా కట్టుబడి ఉందో అని అనుకోవచ్చు. అయితే ఆ 4 రాష్ట్రాల్లో మూడు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఇక్కడ కేంద్రం ప్రేమ రాష్ట్రాలపై కాదు, ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై, ఆ ఎన్నికల్లో బీజేపీకి జరగాల్సిన లబ్ధిపై. అందుకే మోదీ రాష్ట్రాలు చుట్టేస్తున్నారు, ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నారు.
జులై7, 8 తేదీల్లో ప్రధాని మోదీ 4 రాష్ట్రాల్లో పర్యటిస్తారు. చత్తీస్ ఘడ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో ఆయన పర్యటన ఖరారైంది. మొత్తం 4 రాష్ట్రాల్లో 50 కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. వాటి విలువ అక్షరాలా 50వేల కోట్ల రూపాయలు. అక్కడితో ఆగడంలేదు మోదీ, మంత్రి వర్గ తాజా సమావేశంలో కూడా ఆయన ఉదారంగా ఖర్చు చేయండి అంటూ సహచరులకు ఉద్భోదించారు. అది సార్వత్రిక ఎన్నికల దీర్ఘకాలిక లక్ష్యమే అయినా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లోని మంత్రులకు మాత్రం స్పెషల్ టాస్క్ అప్పగించారు మోదీ.
జులై 7న రాయ్ పూర్ విశాఖపట్నం కారిడార్ లోని సిక్స్ లైన్ రోడ్లతోపాటు, రాంచీలో అనేక ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో 3 వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు. గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. సొంత నియోజకవర్గం వారణాసిలో పలు ప్రాజెక్ట్ లు ప్రారంభిస్తారు. మరికొన్నిటికి శంకుస్థాపనలు చేస్తారు. వారణాసి నుండి జౌన్ పూర్ వరకు NH56 లో ఫోర్ లైన్ విస్తరణను జాతికి అంకితం చేస్తారు.
జులై-8న వారణాసి నుంచి తెలంగాణకు వచ్చే మోదీ, NH-563లో భాగంగా కరీంనగర్ - వరంగల్ ఫోర్ లైన్ రోడ్ కి శంకుస్థాపన చేస్తారు. వ్యాగన్ రిపేర్ కర్మాగారానికి శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. వరంగల్ నుంచి బికనీర్ కి వెళ్లి అమృత్ సర్ జామ్ నగర్ ఎక్స్ ప్రెస్ వే లోని వివిధ విభాగాలను జాతికి అంకితం చేస్తారు. బికనీర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా 2రోజుల్లో 50 కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు మోదీ.